కరోనా వైరస్ మహమ్మారి తాను చెప్పిందే నిజమని నిరూపించిందని అభిప్రాయపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనా నుంచి సరఫరా గొలుసులు తరలించాలని, అమెరికాలోనే తయారీకి ప్రాధాన్యమివ్వాలన్న తన మాటలు సత్యమని ఆయన పేర్కొన్నారు.
"నేను చెప్పిన ప్రతిదీ సత్యంగా మారింది" అని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో ట్రంప్ అన్నారు.
" ప్రపంచవ్యాప్తంగా ఉన్నవి చెత్త సప్లై చైన్లు. కొత్తగా ఏర్పటైనవన్నీ మన అమెరికాలో ఉండాలి" అని ఆయన పేర్కొన్నారు.
కరోనా వైరస్ నేపథ్యంలో చైనాపై ట్రంప్ విరుచుకుపడుతున్నారు. వైరస్‌ను ఆవిర్భావ ప్రదేశంలోనే ఆపాల్సిందని, ప్రయోగశాల నుంచే వచ్చిందని, ఈ మహమ్మారిపై సరైన సమాచారం ఇవ్వలేదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ కచ్చితత్వంతో స్పందించలేదని ఆయన ఎన్నో విమర్శలు చేశారు.
అలెన్‌టన్, పెన్సిల్వేనియాకు వెళ్లే ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. వైరస్ వ్యాప్తి ఉన్నా ఆంక్షలు ఎత్తివేయాలని ఆయన రాష్ట్రాలను కోరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓవెన్స్ అండ్ మైనర్ సంస్థను ట్రంప్ సందర్శించనున్నారు. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఆ సంస్థ ఎన్95 మాస్క్‌లు, సర్జికల్ గౌన్లు, గ్లవ్స్ సరఫరా చేసిందని వైట్‌హౌస్ తెలిపింది.
ఇదీ చూడండి:లాక్డౌన్ సడలింపుతో మోగిన బడి గంటలు!