అమెరికా వార్షిక రక్షణ విధాన బిల్లును అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. దేశ భద్రతకు అత్యవసరమైన అంశాలను పొందుపర్చడంలో బిల్లు విఫలమైందని పేర్కొన్నారు. ఈ బిల్లు వల్ల రష్యా, చైనాలకే ప్రయోజనం కలుగుతుందని, ఆ దేశాలకు ఇదొక బహుమతి వంటిదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన వీటో అధికారాన్ని ఉపయోగించి.. బిల్లును తిరస్కరించారు. తన పాలన కాలంలో ట్రంప్ తొలిసారి వీటో అధికారాన్ని ఉపయోగించడం గమనార్హం.
"దేశ భద్రతకు ఈ బిల్లు చాలా ముఖ్యమైందని నా ప్రభుత్వం అనుకుంటోంది. దురదృష్టవశాత్తు, దేశ రక్షణకు సంబంధించిన కీలకమైన అంశాలను చేర్చడంలో ఈ బిల్లు విఫలమైంది. అమెరికా సైనిక చరిత్రను, అనుభవజ్ఞులైన జవాన్లను గౌరవించడంలో ఇందులోని నిబంధనలు విఫలమయ్యాయి. విదేశాంగ విధానాలు, జాతి భద్రతలో అమెరికానే ప్రథమం అన్న మా ప్రభుత్వ ప్రయత్నాలకు ఈ బిల్లు విరుద్ధంగా ఉంది."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
2021 నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్(ఎన్డీఏఏ) పేరుతో రూపొందిన 740 బిలియన్ డాలర్ల బిల్లును అమెరికా కాంగ్రెస్.. ఈ నెల మొదట్లో ఆమోదించింది. తాజా బిల్లులో.. థర్ట్ పార్టీ పోస్టులతో సంబంధం లేకుండా నుంచి సామాజిక మాధ్యమాలకు రక్షణ కల్పించే 1996 కమ్యునికేషన్ డీసెన్సీ చట్టాన్ని రద్దు చేసే నిబంధన లేదని ట్రంప్ గతంలోనే మండిపడ్డారు. ఎన్డీఏఏను వీటో చేస్తానని అప్పుడే హెచ్చరించారు.
మళ్లీ ఆమోదం లాంఛనమే!
ట్రంప్ వీటోను ధిక్కరించాలంటే ఈ బిల్లును కాంగ్రెస్‌లోని ఉభయసభలు మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది. నూతన సభ్యులు ప్రమాణస్వీకారం చేసే జనవరి 3కు ముందే దీన్ని ఆమోదించాలి. లేదంటే బిల్లును మళ్లీ మొదటి నుంచి తయారు చేయాల్సి ఉంటుంది. అయితే ట్రంప్ వీటో చేసిన ప్రస్తుత బిల్లు ఇప్పటికే మూడింట రెండొంతుల మెజారిటీని దక్కించుకుంది. జనవరికి ముందే మరోసారి ఓటింగ్ జరిగితే.. బిల్లు ఆమోదం పొందుతుంది.
ఇదీ చదవండి:అమెరికాకు మరో 10 కోట్ల డోసుల ఫైజర్ టీకా