తెలంగాణ

telangana

ETV Bharat / international

మూడు దశల్లో దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ ఎత్తివేత! - america lockldown updates

దేశవ్యాప్తంగా షట్‌డౌన్‌ ఎత్తివేతకు దశలవారీ మార్గదర్శకాల్ని రూపొందించింది అమెరికా. ఈ మేరకు ఉత్తర్వుల్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌.

trump-unveils-three-phase-plan-to-lift-us-lockdown-leaves-timeline-up-to-governors
మూడు దశల్లో దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ ఎత్తివేత!

By

Published : Apr 18, 2020, 5:31 AM IST

Updated : Apr 18, 2020, 6:48 AM IST

కరోనా వైరస్‌ సృష్టిస్తున్న విలయతాండవం అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేసింది. మరికొన్ని రోజుల పాటు ఇలాగే కొనసాగితే దేశం పూర్తిగా ఛిన్నాభిన్నమైపోయే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై ఆ దేశం దృష్టి సారించింది. షట్‌డౌన్‌ ఎత్తివేతకు దశలవారీ మార్గదర్శకాల్ని రూపొందించింది. ఈ మేరకు ఆయా ఉత్తర్వుల్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించారు అధ్యక్షుడు ట్రంప్‌. అలాగే షట్‌డౌన్‌ ఎత్తివేత అధికారం విషయంలో వెనక్కి తగ్గిన అధ్యక్షుడు.. ఆ బాధ్యతల్ని పూర్తిగా ఆయా రాష్ట్రాల గవర్నర్లకే అప్పగించారు.

అమెరికాలోని 33 కోట్ల మంది జనాభాలో.. దాదాపు 95 శాతం మంది ఆంక్షల పరిధిలో ఉన్నారు. ఇప్పటి వరకు అక్కడ 6లక్షల 76వేల 676 మంది వైరస్‌ బారినపడ్డారు. వీరిలో 34,784 మంది మృతిచెందారు. అందుకే వైరస్‌ను కట్టడి చేసేందుకు కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. భౌతిక దూరం వంటి నిబంధనల్ని తప్పనిసరి చేశారు. షట్‌డౌన్‌ ఎత్తివేత మూడు దశల్లో జరగాలని ట్రంప్‌ పాలకవర్గం తాజాగా నిర్ణయం తీసుకుంది.

"కరోనా మరణాల విషయంలో అమెరికా గరిష్ఠ స్థాయిని దాటేసింది. ఇక ప్రజలు తమ జీవితాల్ని తిరిగి ప్రారంభించబోతున్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి చర్యలు తీసుకుంటున్నాం. అయితే మహమ్మారి బారి నుంచి ప్రజల్ని రక్షించే ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. దేశవ్యాప్తంగా షట్‌డౌన్‌ను అమలుచేయడం కంటే.. ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఆంక్షల్ని కొనసాగిస్తాం. మళ్లీ వర్షాకాలంలో వైరస్‌ తిరగబెట్టొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అలా జరిగితే మేం చేపట్టబోతున్న మూడు దశల ఎత్తివేత ప్రణాళిక ఎంతగానో దోహదపడుతుంది. అవసరమైతే వెంటనే తిరిగి ఆంక్షల్ని కఠినతరం చేసే వెసులుబాటు ఉంటుంది."

-డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా అధ్యక్షుడు

మూడు దశలు ఇలా..

  • వరుసగా 14 రోజులు తగ్గితేనే..

కొత్తగా కరోనా సోకిన వారు, లక్షణాలతో బాధపడుతున్నవారి సంఖ్య వరుసగా 14 రోజుల పాటు తగ్గితే 'స్టే ఎట్‌ హోమ్‌'(ఇంటికే పరిమితం కావడం) ఆదేశాల్ని సడలించొచ్చు. అలాగే తీవ్రతను బట్టి ఇతర ఆంక్షల నుంచి మినహాయింపులు ఇవ్వొచ్చు.

  • సాధారణ ప్రయాణాలు పునరుద్ధరించొచ్చు..

రెండో దశలో వైరస్ ముప్పు ఉన్న వారందరినీ ఇంటికే పరిమితం చేయాలి. అక్కడి నుంచే పనిచేసేందుకు ప్రోత్సహించాలి. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ఉమ్మడి ప్రదేశాలు మాత్రం మూసివేసే ఉంచాలి. ఉద్యోగులను సాధారణ ప్రయాణాలకు అనుమతించొచ్చు. సామూహిక ప్రాంతాలు తెరుచుకోవచ్చు. కానీ, సామాజిక దూరం పాటించాల్సిందే. ఇతర ఆంక్షల్ని సరళతరం చేయొచ్చు లేదా పూర్తిగా ఎత్తివేయొచ్చు.

  • భౌతిక దూరం, పరిశుభ్రత తప్పనిసరి...

వైరస్‌ పూర్తిగా అదుపులోకి వచ్చిందని భావిస్తే సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అడ్డంకిగా ఉన్న ఆంక్షలన్నింటినీ తొలగించొచ్చు. కానీ, సామాజిక దూరం, పరిశుభ్రత విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలి.

ఒక్కో దశలో పరిస్థితుల్ని అంచనా వేసేందుకు డెబోరా బ్రిక్స్‌ నేతృత్వంలోని నిపుణుల బృందం స్పష్టమైన ప్రమాణాలతో ప్రణాళిక రచించింది. ప్రతి అంచెలో చేయాల్సిన వైరస్‌ నిర్ధరణ పరీక్షలు, కొత్త కేసులు, ఆస్పత్రుల్లో సౌకర్యాల వంటి అంశాల్లోనూ స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించింది.

ఇదీ చదవండి:24 గంటల్లో 23 మరణాలు- 1,007 కొత్త కేసులు

Last Updated : Apr 18, 2020, 6:48 AM IST

ABOUT THE AUTHOR

...view details