ట్రంప్ ప్రస్తుత పరిస్థితిని ఆయన సన్నిహితుడొకరు వాస్తవానికి కాస్త దగ్గరగా ‘ద వాషింగ్టన్ పోస్ట్’కు వివరించారు. పద్దెనిమిదో శతాబ్దంలో రాజకీయ తిరుగుబాట్ల మధ్య మతిభ్రమించిన గ్రేట్ బ్రిటన్ చక్రవర్తి మూడో కింగ్ జార్జిలాగా ఇప్పుడు తమ అధ్యక్షుడు ఉన్నార[ని అనధికారికంగా ఆయన వాపోయారు. ‘నేనే గెలిచాను... నేనే గెలిచాను’ అని గొణుక్కుంటూ, తిట్టుకుంటూ వైట్‌హౌస్ చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఆ మాటలను నిజం చేస్తున్నట్లే ఉంది ప్రెసిడెంట్ ప్రవర్తన. పెన్సిల్వేనియా అత్యున్నత న్యాయస్థానం నుంచి తనకు వ్యతిరేకంగా తీర్పు వెలువడటంతో తీవ్ర అసహనానికి గురైన ట్రంప్ ఇప్పుడు కోర్టులనూ తప్పుపడుతున్నారు. తగిన సాక్ష్యాధారాలను సమర్పించుకునే అవకాశం తమకు ఇవ్వడం లేదని దుమ్మెత్తిపోస్తున్నారు. ఆధారరహితమైన ఆరోపణలతో వందల కేసులు వేసి ప్రతికూల ఫలితాలు రావడంతో అడ్డూఅదుపూ లేకుండా అన్ని వ్యవస్థలనూ ఆడిపోసుకుంటున్నారు. అసహనం పెరిగిపోయి అసాధారణ, అనారోగ్యకర మానసిక స్థితితో వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో అవకతవకలు, అన్యాయాలు జరిగినప్పటికీ తనకు అనుకూలంగా ఎఫ్‌బీఐ ఒక్క ప్రకటనా చేయలేదని, ఆ సంస్థ క్రియాశీలత కోల్పోయిందని తిట్టిపోస్తున్నారు. ఓడిపోయిన ప్రతిచోటా ఉన్న అధికారులను తనకు వ్యతిరేకులుగా, దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు.
ట్రంప్ పదవిని చేపట్టడం, చేజార్చుకోవడం రెండూ వివాదాలుగానే మిగిలాయి. రష్యా జోక్యంతో కొన్ని రాష్ట్రాల్లో ఓట్లు పడటం వల్లే ట్రంప్ విజయం సాధించారనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఇప్పుడేమో భారీ రిగ్గింగ్ వల్లే బైడెన్ గెలిచారని గొంతు పగిలిపోయేలా అరిచి అల్లర్లు సృష్టించి ట్రంప్ అల్లకల్లోలం చేస్తున్నారు. ఎన్నికలు అత్యంత సురక్షితంగా జరిగాయని పేర్కొన్న హోంశాఖ ఉన్నతాధికారిని పదవి నుంచి తొలగించారు. తన అధికారం అవసాన దశకు చేరుకుందనే సత్యం అతి కష్టం మీద బుర్రకెక్కుతుంటే చిత్తచాపల్యం పెరిగి అనేక అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఇరాన్ అణుస్థావరాలపై దాడికి తెగబడేందుకు మంతనాలు చేశారు. పెంటగాన్ రక్షణ ప్రధానకేంద్రంలో, నిఘా సంస్థలో ఉన్నత పదవుల్లో తన విశ్వాసపాత్రులను హఠాత్తుగా నియమించారు. సైనిక కుట్రకు పాల్పడతారేమో అనే అనుమానాలనూ రేకెత్తించారు.
అత్యధిక శాతం..