అమెరికాలో ప్రత్యేక వృత్తుల్లో తాత్కాలికంగా పని చేయడానికి అవసరమయ్యే హెచ్-1బీ, ఎల్- 1 తదితర వీసాలపై దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బీ సహా వివిధ తాత్కాలిక ఉపాధి వీసాలను ఈ ఏడాది చివరి వరకు (డిసెంబర్ 31, 2020) నిలిపివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై మంగళవారం సంతకం చేస్తారని శ్వేతసౌధం అధికారులు వెల్లడించారు. తాజా నిర్ణయం అమెరికాలోకి వలసలను నిరోధిస్తుందని తెలిపారు.
కరోనా సంక్షోభం కారణంగా నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగిన నేపథ్యంలో అమెరికన్లకు అవకాశాలు కల్పించాలనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటున్నారని వెల్లడించారు అధికారులు. అయితే.. ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు.
తాజా ఆంక్షలు.. హెచ్-1బీతో పాటు తాత్కాలిక ఉపాధి వీసాలు హెచ్-2బీ, జే-1, ఎల్-1 వీసాలకు కూడా వర్తిస్తాయని తెలిపారు అధికారులు. ప్రస్తుత నిర్ణయం తాత్కాలికమే అయినా.. అమెరికా వీసా జారీ వ్యవస్థలో సంస్కరణలతో శాశ్వత మార్పులు ఉంటాయన్నారు. కేవలం నైపుణ్యవంతులే అమెరికాలో కాలుపెట్టేలా కొత్త నిర్ణయాలు ఉండొచ్చని చెప్పారు.