తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాతో తెగతెంపులకు సిద్ధమే: ట్రంప్​ - చైనాపై ఆంక్షలకు అమెరికా అమెరికా 18 సూత్రాల ప్రణాళిక​

అవసరమైతే చైనాతో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటామని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరోవైపు ఆర్థిక యుద్ధంలో భాగంగా చైనాలో అమెరికా పెన్షనర్ల నిధి నుంచి పెట్టిన వేల కోట్ల డాలర్ల పెట్టుబడులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన ఆదేశించారు.

Trump threatens to cut off whole relationship with China
చైనాతో తెగతెంపులు చేసుకోవడానికైనా సిద్ధమే: ట్రంప్​

By

Published : May 15, 2020, 12:00 PM IST

కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో చైనాపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా తీవ్ర హెచ్చరికలు చేశారు. అవసరమైతే చైనాతో సంబంధాల్ని పూర్తిగా తెగతెంపులు చేసుకోవడానికి వెనుకాడమని తేల్చిచెప్పారు. దీనివల్ల అమెరికాకు 500 బిలియన్‌ డాలర్లు ఆదా అవుతాయని చెప్పుకొచ్చారు. మహమ్మారి విషయంలో చైనా వ్యవహార శైలితో తాను ఏమాత్రం సంతృప్తికరంగా లేనన్నారు.

చర్చల్లేవ్​...!

ఇరుదేశాల మధ్య ఇటీవల కుదిరిన తొలిదశ వాణిజ్య ఒప్పందం విషయంలో పునఃచర్చలకు ఆస్కారమే లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా అమెరికాను చైనా కొల్లగొడుతోందని.. దీన్ని భవిష్యత్తులో కొనసాగనిచ్చేది లేదన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరపడానికి తాను ఏమాత్రం ఇష్టపడడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:చైనాపై ఆంక్షలకు అమెరికా '18 సూత్రాల' ప్రణాళిక​

పెట్టుబడులు ఉపసంహరిస్తాం...

అమెరికా... చైనాతో ఆర్థిక యుద్ధాన్ని ముమ్మరం చేస్తోంది. చైనాలో అమెరికా పెన్షనర్ల నిధి నుంచి పెట్టిన వేల కోట్ల డాలర్ల పెట్టుబడులను వెంటనే ఉపసంహరించుకోవాలని ట్రంప్ ఆదేశించారు.

న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్​లో నమోదైన అలీబాబా లాంటి చైనా సంస్థల పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు... దీనిపై దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు ట్రంప్​ తెలిపారు. చైనా సంస్థలు లండన్‌ లేదా వేరే ఇతర దేశపు సంస్థల స్టాక్ ఎక్స్చేంజ్​లో లిస్ట్ అవుతాయా? లేదా? అన్నది త్వరలో తేలుతుందని ఆయన అన్నారు.

డబ్ల్యూహెచ్‌ఓపై త్వరలో నిర్ణయం..

వైరస్ వ్యాప్తి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)పైనా విమర్శలు గుప్పిస్తున్న ట్రంప్‌ ... ఆ సంస్థపై త్వరలోనే ఓ కీలక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే, అది ఏ అంశంపై అన్నది మాత్రం స్పష్టతనివ్వలేదు. వైరస్‌పై ప్రపంచ దేశాల్ని అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందని ఆరోపిస్తున్న ట్రంప్‌... ఆ సంస్థకు ఇచ్చే నిధుల్ని సైతం ఇప్పటికే నిలిపివేశారు.

ఇదీ చూడండి:నేను చెప్పిన ప్రతిదీ నిజమయింది: ట్రంప్‌

ABOUT THE AUTHOR

...view details