Trump Social Media App: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా యాప్ రెడీ అయ్యింది. ఇప్పటికే వినియోగంలో ఉన్న దిగ్గజ సంస్థలకు పోటీగా 'ట్రూత్ సోషల్ (TRUTH Social)' పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ యాప్ ఫిబ్రవరి 21న అందుబాటులోకి రానుంది. వీటికి సంబంధించి 'టైం ఫర్ సమ్ ట్రూత్' అంటూ మాజీ అధ్యక్షుడి కుమారుడు డొనాల్ట్ ట్రంప్ జూనియర్ ఇటీవలే ట్వీట్ చేశారు. అయితే, ప్రస్తుతం ఇది యాపిల్‌కు చెందిన యాప్ స్టోర్‌లోనే అందుబాటులో ఉండనుంది.
Truth Social App: గతేడాది జనవరి 6న అమెరికా పార్లమెంట్ సముదాయం కేపిటల్ హిల్‌పై దాడి జరిగింది. బైడెన్ చేతిలో ఓటమి చెందిన అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలకు ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విటర్ తొలుత డొనాల్డ్ ట్రంప్ ఖాతా నిలివేసింది. అదేదారిలో పయణించిన ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి ఇతర సామాజిక మాధ్యమ సంస్థలు కూడా ఆయన అకౌంట్లను శాశ్వతంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో తానే స్వయంగా సోషల్ మీడియా వేదికను ఏర్పాటు చేసుకుంటానని డొనాల్ట్ ట్రంప్ ప్రకటించారు. టెక్ దిగ్గజ సంస్థల దౌర్జన్యాలను దీటుగా ఎదుర్కొనేందుకు సొంత యాప్‌తో ముందుకు వస్తానని వెల్లడించారు.