Trump Social Media app: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ త్వరలో కొత్త సోషల్‌మీడియా వేదికను ప్రారంభించనున్నారు. 'ట్రూత్ సోషల్' అనే యాప్ ద్వారా మరోసారి సామాజిక మాధ్యమాల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 21న ఈ యాప్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఏడాది కిందట అమెరికా పార్లమెంటు భవన సముదాయం కేపిటల్ హిల్‌పై దాడి ఘటనలో డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలిన నేపథ్యంలో ట్రంప్‌పై సామాజిక మాధ్యమాలన్నీ బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో చోటులేని ట్రంప్.. ఇప్పుడు తానే కొత్తగా యాప్‌ని ఏర్పాటు చేసుకున్నారు.
'ది ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్' (టీఎంటీజీ) ఆధ్వర్యంలో 'ట్రూత్ సోషల్ యాప్' వస్తోంది. ట్విటర్‌ను పోలి ఉండే ఈ యాప్‌లోనూ ఒకరినొకరు ఫాలో చేయొచ్చు. ట్రెండింగ్‌లో ఉన్న విషయాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్‌కి సంబంధించిన నమూనా ఫొటోలు ఇప్పటికే విడుదలయ్యాయి. సాధారణంగా ట్విటర్‌లో పోస్ట్ చేసేవాటిని ట్వీట్ అంటాం. ట్రూత్ సోషల్ మీడియా యాప్‌లో మాత్రం 'ట్రూత్' అని సంబోధిస్తారు. ఇప్పటికే ఈ యాప్ యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. యూట్యూబ్ తరహాలో మరో వేదికను కూడా ట్రంప్ తీసుకురానున్నారు. అది కుదరని పక్షంలో టీఎంటీజీ ఆధ్వర్యంలో పాడ్‌కాస్ట్ నెట్‌వర్క్‌నైనా తీసుకురానున్నారట!