అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'హాంకాంగ్ స్వయంప్రతిపత్తి చట్టం'పై మంగళవారంసంతకం చేశారు. అలాగే హాంకాంగ్‌కు ఇస్తున్న ప్రత్యేక (ఆర్థిక) హోదాను కూడా రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుకు ఆమోదం తెలిపారు.
"హాంకాంగ్ ప్రజలపై చైనా అణచివేత చర్యలకు పాల్పడుతోంది. దీనిపై చైనా జవాబుదారీగా ఉండేందుకు గాను .. ఈ రోజు నేను ఓ చట్టంపై, ఓ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశాను."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఏకగ్రీవ ఆమోదం
హాంకాంగ్ స్వయంప్రతిపత్తి చట్టాన్ని కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఆమోదించిందని ట్రంప్ పేర్కొన్నారు. దీనితో హాంకాంగ్ స్వేచ్ఛను హరించిన శక్తులపై చర్య తీసుకోవడానికి.. ప్రభుత్వానికి శక్తిమంతమైన కొత్త సాధనం సమకూరిందని ఆయన అన్నారు.
"హాంకాంగ్ ప్రజల స్వేచ్ఛను హరించారు. వారి హక్కులను కాలరాశారు. ఇది మంచిది కాదు. దీని వల్ల ఇకపై హాంకాంగ్ స్వేచ్ఛా మార్కెట్లతో పోటీ పడలేదు. నా అభిప్రాయం ప్రకారం, చాలా మంది ప్రజలు అక్కడి నుంచి బయటకి వెళ్లిపోతారు. ఫలితంగా మనం (అమెరికా) మరింతగా వ్యాపార అభివృద్ధి సాధిస్తాం. ఎందుకంటే హాంకాంగ్ లాంటి మంచి పోటీదారుని కోల్పోయాం."