కరోనా వ్యాక్సిన్ తొలుత అమెరికన్లకు లభించే విధంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇతర దేశాలకు టీకాలు అందించే ముందు తమ దేశానికే ప్రాధాన్యతనిచ్చేందుకు ఈ చర్యలు చేపట్టారు.
అగ్రరాజ్య ప్రజలకే తొలుత వ్యాక్సిన్ అందించే విషయంలో.. అవసరమైతే డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్(డీపీఏ)నూ అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు ట్రంప్. ప్రభుత్వ ఆర్డర్లకే తొలి ప్రాధాన్యతనిచ్చే విధంగా ప్రైవేటు సంస్థలపై డీపీఏ ఒత్తిడి పెంచుతుంది.
సురక్షితమైన, సమర్థవంతమైన తొలి కరోనా వ్యాక్సిన్ను అగ్రరాజ్య కంపెనీలే రూపొందించాయని హర్షం వ్యక్తం చేశారు ట్రంప్. కరోనాపై త్వరలోనే విజయం సాధిస్తామని.. శ్వేతసౌధంలో జరిగిన 'ఆపరేషన్ వార్ప్ స్పీడ్' కార్యక్రమం సందర్భంగా వ్యాఖ్యానించారు.
"మేము త్వరలోనే కరోనా మహమ్మారిని అంతం చేస్తాం. దీంతో అమెరికా సహా.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను రక్షిస్తాం. అందుకోసం మా పాలనా యంత్రాంగంలోనే.. మొదటగా సురక్షితమైన, సమర్థవంతరమైన వ్యాక్సిన్ ఉత్పత్తిని చేశాం."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.