తెలంగాణ

telangana

ETV Bharat / international

హాంకాంగ్​ బిల్లుపై ట్రంప్​ సంతకం- చైనాతో కొత్త రగడ

హాంకాంగ్ ప్రజాస్వామ్య నిరసనకారులకు మద్దతు తెలుపుతూ చట్టం చేసింది అగ్రరాజ్యం అమెరికా. కాంగ్రెస్, సెనేట్​ల ఆమోదం పొందిన రెండు బిల్లులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోద ముద్ర వేశారు. అయితే నిరసనకారులకు మద్దతిచ్చేలా అగ్రరాజ్య నిర్ణయం ఉందని హాంకాంగ్ ప్రభుత్వం పేర్కొనగా, అమెరికాకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చైనా హెచ్చరికలు జారీ చేసింది.

By

Published : Nov 28, 2019, 10:56 AM IST

hongkong
హాంకాంగ్​ బిల్లుపై ట్రంప్​ సంతకం- చైనాతో కొత్త రగడ

హాంకాంగ్ ప్రజాస్వామ్య నిరసనకారులకు అమెరికా మద్దతివ్వడానికి ఉద్దేశించిన రెండు బిల్లులకు ఆమోద ముద్ర వేశారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 1992 నాటి హాంకాంగ్ విధాన చట్టాన్ని సవరిస్తూ తెచ్చిన 'హాంకాంగ్​లో మానవహక్కులు, ప్రజాస్వామ్య చట్టం-2019' వీటిలో ప్రధానమైంది. హాంకాంగ్​లో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న అక్కడి అధికారులపై ఆంక్షలు విధించేలా రూపొందించిన ఈ బిల్లుకు ఇటీవలే అమెరికా కాంగ్రెస్​ ఉభయసభలు ఆమోదం తెలిపాయి. తాజాగా ట్రంప్​ సంతకం చేశారు.

"చైనా అధ్యక్షుడు జిన్​పింగ్, ఆ దేశ పౌరులు, హాంకాంగ్ వాసుల పట్ల గౌరవంతో నేను ఈ బిల్లుపై సంతకం చేశాను. చైనా, హాంకాంగ్ ప్రజలు ఇరు వర్గాల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోగలరని భావిస్తున్నాను. నూతన చట్టం ఆ ప్రాంతంలో దీర్ఘకాలికంగా శాంతి, అభివృద్ధికి దోహదం చేస్తుంది."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

హాంకాంగ్ బిల్లుపై తొలుత సంతకం చేయనని చెప్పారు ట్రంప్. మనసు మార్చుకుని ఆమోదముద్ర వేయడంపై చట్టసభసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

'అగ్రరాజ్య నిర్ణయం సరికాదు'

ప్రజాస్వామ్య నిరసనకారులకు మద్దతు ఇస్తూ అమెరికా చట్టం చేయడం సరికాదని పేర్కొంది హాంకాంగ్ ప్రభుత్వం.

"అమెరికా చేసిన రెండు చట్టాలు హాంకాంగ్​ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే. అగ్రరాజ్య వైఖరి నిరసనకారులకు తప్పుడు సందేశమిచ్చే అవకాశం ఉంది."

-హాంకాంగ్ ప్రభుత్వం

'అమెరికా వ్యతిరేక వైఖరికి సిద్ధం'

అమెరికా వ్యతిరేక వైఖరికి తాము సిద్ధమని చైనా ప్రకటించింది. హాంకాంగ్ ప్రజాస్వామ్య నిరసనకారులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని అగ్రరాజ్యాన్ని హెచ్చరించింది. చైనా, హాంకాంగ్​ పౌరులంతా అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నామో చైనా చెప్పలేదు.

"అమెరికా నిర్ణయం అభ్యంతరకరం. పూర్తి దురుద్దేశపూర్వకం."

-చైనా ప్రకటన

ఇదీ చూడండి: గ్రీన్​కార్డు కోసం 2లక్షలకుపైగా భారతీయుల నిరీక్షణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details