అమెరికా-తాలిబన్ల మధ్య శనివారం జరిగిన శాంతి ఒప్పందంపై స్పందించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. యుద్ధంపై ప్రతి ఒక్కరు విసిగిపోయారని.. సుదీర్ఘకాలం జరిగిన ఘర్షణలో ఎంతో మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ట్రంప్. చాలా కాలంగా పోరాడిన తమ సైనికులను ఈ సందర్భంగా అభినందించారు.
''తాలిబన్లతో శాంతి ఒప్పందం ఎంతో చారిత్రత్మకమైనది. ఒకవేళ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే మాత్రం ఎవరు ఊహించనంతగా మా సైన్యం తిరిగి వస్తుంది''.
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
త్వరలోనే తాలిబన్ల నాయకులను వ్యక్తిగతంగా కలవనున్నట్లు చెప్పిన అధ్యక్షుడు.. అఫ్గానిస్థాన్‌లోని ఉగ్రవాదులను హతమార్చడంలో బ్రహ్మాండమైన విజయం సాధించినట్లు వెల్లడించారు. ఈ ఒప్పందంతో అగ్రరాజ్య సైనికులు వెనక్కి రావలసిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఒప్పందం చారిత్రాత్మకమైనదని ఉద్ఘాటించారు.