కరోనా వైరస్ కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండడం 'గౌరవ సూచిక' అని వ్యాఖ్యానించారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ . తమ ప్రభుత్వం అత్యంత ఎక్కువ సంఖ్యలో కొవిడ్-19 నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తోందని... అందుకే 15 లక్షల కరోనా పాజిటివ్ కేసులను గుర్తించగలిగామని ఆయన వివరించారు.
కరోనా విజృంభణ తరువాత శ్వేతసౌధంలో నిర్వహించిన మొదటి మంత్రివర్గ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
" అమెరికా... ఇతర దేశాలతో పోల్చితే అత్యధిక సంఖ్యలో కొవిడ్-19 పరీక్షలు నిర్వహించింది. అందుకే మన వద్ద పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇది ఓ మంచి విషయం. నిజంగా ఇది ఓ గొప్ప గౌరవ సూచకం."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
యూఎస్ ఫెడరల్ ఏజెన్సీ అయిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం... ఇప్పటి వరకు అమెరికా 12.6 మిలియన్ కొవిడ్ పరీక్షలు నిర్వహించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన 3 లక్షల 25 వేలకు పైగా మరణించగా... అందులో 91 వేల మంది అమెరికన్లే కావడం గమనార్హం.