చైనాపై ఆంక్షల అస్త్రం ప్రయోగించింది అమెరికా. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో సంబంధాలు ఉన్న విద్యార్థులు, పరిశోధకులకు అమెరికాలో ప్రవేశాన్ని నిలిపేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వీరి ద్వారా అమెరికా మేధో సంపత్తిని దొంగలిస్తున్నారని ఆరోపించారు.
చైనా వ్యవహార శైలిని తీవ్రస్థాయిలో తప్పుబట్టారు ట్రంప్. కరోనాకు సంబంధించి చైనా పారదర్శకంగా వ్యవహరించేంత వరకు కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు.
"పీజీ, డాక్టరేట్ విద్యార్థులతో సంప్రదాయేతర పద్ధతుల్లో మేధో సంపత్తిని చైనా దొంగలిస్తోంది. అందువల్ల ఇక్కడికి వచ్చే పీజీ విద్యార్థులు, పరిశోధకులకు పీఎల్ఏతో సంబంధాలు ఉన్నాయి. దీని వెనుక చైనా అధికారుల కుట్ర ఉంది. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన కొంతమంది పౌరులు ఎఫ్, జే (విద్య, పరిశోధన) వీసాలపై వచ్చేవారికి ప్రవేశం నిషేధిస్తున్నాం."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఎఫ్-1 వీసాలతో ఫుల్ టైమ్ డిగ్రీ, ఇతర కోర్సులు.. జే-1 వీసాలతో సాంస్కృతిక, ఇతర విషయాలపై పరిశోధనకు అనుమతిస్తారు. ఎఫ్-1 వీసాలు కోర్సు పూర్తయ్యే వరకు వర్తిస్తుంది. జే-1 వీసాలు ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ (కొన్ని సందర్భాల్లో) పని చేసేందుకు అవకాశం కల్పిస్తుంది.
వాణిజ్యపరంగా..
అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదై, తమ దేశ చట్టాలను గౌరవించని చైనా కంపెనీలపైనా చర్యలు తీసుకుంటామని ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే చైనా పౌరులను ఇకపై అమెరికాలోకి అనుమతించబోమని తేల్చి చెప్పారు. అమెరికాలో చైనా పెట్టుబడుల విషయంలోనూ నిబంధనల్ని కఠినతరం చేస్తామని ప్రకటించారు.
"గత కొన్నేళ్లుగా అమెరికాను చైనా కొల్లగొడుతోంది. మేధో హక్కులతో పాటు బిలియన్ల డాలర్లు విలువైన పెట్టుబడుల్ని అక్రమ మార్గాన మళ్లించుకుంటోంది. అలాగే ఉద్యోగాల్లోనూ అమెరికా నిబంధనల్ని అతిక్రమించింది. వాణిజ్యం విషయంలోనూ ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ నిబంధనల్ని పాటించలేదు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆధిపత్యం కోసం వెంపర్లాడుతూ.. అంతర్జాతీయ వాణిజ్యానికి విఘాతం కలిగిస్తోంది. చైనాతో అమెరికా ఎప్పటికీ నిర్మాణాత్మక బంధాన్నే కోరుకుంటోంది. కానీ, అందుకోసం దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడలేం."