ఇరాన్‌పై దాడికి సిద్ధమై మనసు మార్చుకున్న ట్రంప్! ఇరాన్‌పై సైనిక దాడికిఅనుమతించి.. ఆ వెంటనే తన ఆదేశాలను ఉపసంహరించుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తొలుత ఈ విషయంపై ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. కొన్ని గంటల తర్వాత ట్రంపే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
దాడికి సిద్ధమైన పదినిమిషాల్లోనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ట్వీట్ చేశారు ట్రంప్. ఈ దాడి వల్ల ఎంతమంది చనిపోతారని ప్రశ్నించినప్పుడు ఓ అధికారి 150 మందికిపైగా మరణించవచ్చునని చెప్పడం వల్ల దాడిని విరమించుకున్నట్లు ట్రంప్ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.
మూడు లక్ష్యాలు...
దాడులకుగురువారం సాయంత్రం ట్రంప్ అనుమతించినట్లు కొందరు అధికారులు తెలిపారు. అందుకోసం ఇరాన్‌లోని రాడార్ కేంద్రాలు, మిసైల్ బ్యాటరీల వంటి మూడు లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు వివరించారు. అధ్యక్షుడి ఆదేశానుసారం దాడులకు అనుగుణంగా విమానాలు గాల్లోకి ఎగిరాయని, యుద్ధ నౌకలు తమ స్థావరాల్లో సిద్ధంగా ఉన్నాయన్నారు. అంతలోనే ట్రంప్ నుంచి సైనిక చర్యను నిలిపివేయాలని ఆదేశాలు రావడం వల్ల దాడికి సిద్ధంగా ఉన్న క్షిపణులను ఆపేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఖండించిన ఇరాన్...
డ్రోన్ కూల్చివేతకు ప్రతీకారంగా తమ దేశంపై దాడికి అమెరికా సిద్ధమైందన్న వార్తలను ఇరాన్ ఖండించింది. అగ్రరాజ్యం తమకు ఎలాంటి సందేశం పంపలేదని పేర్కొన్నారు ఇరాన్ జాతీయ భద్రత మండలి ప్రతినిధి కేయివాన్ ఖోస్రావి. అలాంటి వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు.
ఇదీ చూడండి:ఇరాన్‌పై ప్రతీకార దాడి యోచనలో అమెరికా?