'అమెరికా ఫస్ట్' నినాదంతో పాలన సాగిస్తున్న డొనాల్డ్ ట్రంప్.. అక్కడి ఉద్యోగాల్లోనూ స్థానికులకే పెద్దపీట వేస్తూ ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవలే టెనెస్సీ వ్యాలీ అథారిటీ(టీవీఏ) వందల మంది అమెరికన్ వర్కర్లను తొలగించి.. ఆ స్థానంలో తక్కువ జీతానికి పనిచేసే విదేశీ ఉద్యోగులను నియమించుకోవాలని భావించిందట. ఆ విషయంలో జోక్యం చేసుకున్న ట్రంప్.. ఆ నిర్ణయాన్ని అడ్డుకొన్నారు. అలా వందల మంది అమెరికన్ల ఉద్యోగాలను కాపాడానని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఆ బోర్డు ఛైర్మన్‌ను తొలగించినట్లు స్పష్టం చేశారు.
రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయినట్లు అధికారికంగా ప్రకటించాక.. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో ట్రంప్ ప్రసంగించారు. అమెరికన్ల ఉద్యోగ భద్రత కోసం తాము తీసుకున్న నిర్ణయాల్లో టీవీఏ సంఘటనను ఓ ఉదాహరణగా పేర్కొన్నారు.
"టెనెస్సీ వ్యాలీ అథారిటీ వందల మంది అమెరికన్ ఉద్యోగులను బలవంతంగా తొలగిస్తోందని తెలుసుకున్నా. వారి స్థానాల్లో తక్కువ వేతనానికి పనిచేసే విదేశీ ఉద్యోగులను భర్తీ చేయాలని భావించారు. అయితే నేను జోక్యం చేసుకొని ఆ బోర్డు ఛైర్మన్‌ను తొలగించా. ప్రస్తుతం నైపుణ్యమున్న ఆ అమెరికన్ వర్కర్లు మళ్లీ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. అందులో జార్జియా, అలబామా, టెనెస్సీ, కెంటకీ, మిసిసిప్పీ, ఉత్తర కరోలినా, వర్జీనియాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. అలా ఉద్యోగాలు తిరిగి పొందిన వాళ్లు ఈ సమావేశంలో చాలా మందే ఉన్నారు."