కరోనా వైరస్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కూడా భయపెడుతోంది. వైరస్ సోకకుండా తీసుకునే జాగ్రత్తలతో ఇబ్బంది పడుతున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు.
పరిశుభ్రతకు సంబంధించి ఎయిర్‌లైన్, పరిపాలన విభాగాలకు చెందిన అధికారులతో భేటీ అయ్యారు ట్రంప్. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆరా తీశారు.
అధికారుల వివరణ
విమానాల్లో శుభ్రతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు ట్రంప్‌నకు వివరించారు అధికారులు. ఈ సందర్భంగా శ్వేతసౌధ కరోనా వైరస్ స్పందన సమన్వయకర్త డెబోరా మాట్లాడుతూ.. "చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.. ముఖాన్ని చేతులతో ముట్టుకోకపోవటం వంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది" అని వివరించారు.
దీనిపై స్పందించిన ట్రంప్ ఛలోక్తి విసిరారు. తనకు క్రిములంటే భయమని చెప్పారు. కొన్ని వారాలుగా నా ముఖాన్ని తాకలేదు.. చాలా మిస్సవుతున్నానంటూ నవ్వులు పూయించారు.
9 మంది మృతి..
అమెరికాలో కరోనా మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. వీరంతా వాషింగ్టన్ రాష్ట్రానికి చెందినవారే. బాధితుల సంఖ్య 100దాటినట్లు అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది.