తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాతో రెండోదశ వాణిజ్య చర్చలకు ట్రంప్ నో!

చైనాతో రెండోదశ వాణిజ్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విముఖత వ్యక్తం చేశారు. కొత్త చర్చలపై ఆసక్తి లేదని.. ముందైతే జనవరి ఒప్పందానికి చైనా కట్టుబడి ఉంటుందో లేదో చూడాలని వ్యాఖ్యానించారు.

US-CHINA-TRADE
చైనాతో వాణిజ్య ఒప్పందానికి ట్రంప్ విముఖత

By

Published : May 12, 2020, 12:08 PM IST

చైనాతో వాణిజ్య చర్చలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంతో రెండో దశ చర్చలను పునరుద్ధరించేందుకు విముఖత వ్యక్తం చేశారు.

చైనా అమెరికాతో వాణిజ్య చర్చల పునరుద్ధరించాలని భావిస్తోందని హాంకాంగ్​కు చెందిన ఓ పత్రిక కథనం ప్రచురించింది. చైనాకు అనుకూలంగా ఉండేలా ఈ ఒప్పందం ఉంటుందని అందులో పేర్కొంది. దీనిపై రోజ్​ గార్డెన్​ సమావేశంలో ట్రంప్​ను ప్రశ్నించగా ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.

"నేను కూడా ఈ విషయం విన్నాను. అది సాధ్యం కాదు. నాకైతే ఇందులో ఆసక్తి లేదు. ముందైతే జరిగిన ఒప్పందంపై వాళ్లు ఎంతవరకు కట్టుబడి ఉంటారో చూద్దాం."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

వాణిజ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఈ ఏడాది జనవరిలో అమెరికా- చైనా మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 2017లో అమెరికా ఉత్పత్తులు, సేవల కొనుగోళ్లకు చైనా వెచ్చించిన 2 లక్షల కోట్ల డాలర్లకు అదనంగా 2020-21లో దిగుమతి చేసుకోవాలని నిర్ణయించాయి.

అయితే ఏదైనా ప్రకృతి విపత్తు లేదా అనుకోని పరిస్థితులు ఏర్పడితే మళ్లీ తాజా వాణిజ్య చర్చలకు అవకాశం లభించేలా ఒప్పందంలో చేర్చారు. దీనిని చైనా ఉపయోగించుకునే అవకాశం ఉందని అమెరికా- చైనా ఆర్థిక, భద్రత సమీక్ష కమిషన్​ నివేదించింది.

ఇది గమనించి ముందే అప్రమత్తమైన అమెరికా ఇప్పటికే చైనాకు హెచ్చరికలు చేసింది. కరోనా సాకు చూపి ఒప్పందానికి చైనా కట్టుబడి ఉండకపోతే రద్దు చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఒప్పందాన్ని చైనా గౌరవించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్​ మ్యూచిన్ గతవారం హెచ్చరించారు.

వారికిదేమీ కొత్తనా?

అమెరికా చేస్తోన్న వ్యాక్సిన్ ప్రయోగాల సమాచారాన్ని చైనా హ్యాకర్లు దొంగలిస్తున్నారని వస్తోన్న వార్తలపైనా ట్రంప్ స్పందించారు.

"చైనాతో నేను సంతోషంగా లేను. వాళ్ల మూలం వద్దే వైరస్​ను నియంత్రించి ఉండాల్సింది. ఇప్పుడు హ్యాకింగ్ గురించి చెబుతున్నారు. చైనాకు ఇది కొత్తేమీ కాదు కదా? చెప్పండి.. ఇందులో కొత్త విషయం ఏముంది? మేం వారిని చాలా దగ్గరి నుంచి పరిశీలిస్తున్నాం."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

కరోనా వైరస్​ చికిత్సపై అమెరికా చేస్తోన్న పరిశోధనలను దొంగలించేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోందని ఎఫ్​బీఐతోపాటు హోంల్యాండ్ సెక్యురిటీ శాఖ బహిరంగ హెచ్చరిక చేసేందుకు సిద్ధమవుతున్నాయని సమాచారం. దేశ మేధోసంపదను రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హోంల్యాండ్​ శాఖకు చెందిన ఉన్నత కమిటీ సభ్యుడు మైక్​ రోజర్స్​ స్పష్టంచేశారు.

ఇదీ చూడండి:అమెరికా అధ్యక్షుడికి కరోనా సెగ - దిద్దుబాటు చర్యల్లో బిజీ!

ABOUT THE AUTHOR

...view details