తెలంగాణ

telangana

By

Published : Nov 13, 2019, 7:44 AM IST

Updated : Nov 13, 2019, 9:24 AM IST

ETV Bharat / international

ప్రజల ముందుకు 'ట్రంప్‌ అభిశంసన'

అమెరికా అధ్యక్ష పదవి నుంచి డొనాల్డ్​ ట్రంప్​ను గద్దె దించడమే లక్ష్యంగా డెమోక్రాట్లు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ట్రంప్​ అభిశంసనపై ప్రజల ఎదుట విచారణ జరపనున్నారు. అధ్యక్ష పదవి ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ప్రజల ముందుకు ‘ట్రంప్‌ అభిశంసన’

అమెరికా అధ్యక్ష పదవి నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ను అభిశంసించడమే లక్ష్యంగా డెమోక్రాట్లు వేగంగా పావులు కదుపుతున్నారు. అభిశంసనపై బుధవారం నుంచి వారు ప్రజల ఎదుట విచారణ జరపనున్నారు. ట్రంప్‌నకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సమీకరించనున్నారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.

అభిశంసన ఎందుకు?

డెమోక్రటిక్‌ నేత జో బిడెన్‌ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు హంటర్‌ బిడెన్‌ ఉక్రెయిన్‌ సహజవాయు సంస్థలో కీలక పదవిలో నియమితులయ్యారు. ప్రస్తుతం జో బిడెన్‌ దేశాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో హంటర్‌ నియామకంపై దర్యాప్తు జరిపించాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీపై ట్రంప్‌ ఒత్తిడి తెచ్చారని.. దర్యాప్తు జరిపించకపోతే ఆ దేశానికి 40 కోట్ల డాలర్ల సైనిక సాయాన్ని నిలిపివేస్తానని బెదిరించడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలొచ్చాయి.

రాజ్యాంగం ఏం చెబుతోంది?

దేశ ద్రోహం, ముడుపుల స్వీకరణ, తీవ్ర నేరాలకు పాల్పడినప్పుడు ప్రతినిధుల సభ దేశాధ్యక్షుణ్ని అభిశంసించవచ్చునని అమెరికా రాజ్యాంగం చెబుతోంది. వేటిని తీవ్ర నేరాలుగా పరిగణించాలనేదానిపై మాత్రం అందులో స్పష్టత లేదు. ట్రంప్‌ అధికార దుర్వినియోగం తీవ్ర నేరం కిందకు వస్తుందని డెమోక్రాట్ల వాదన. ప్రతినిధుల సభ అభింశంసించిన అనంతరం ఆ తీర్మానం సెనేట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీతో తప్పనిసరిగా ఆమోదం పొందాల్సి ఉంటుంది. గతంలో బిల్‌ క్లింటన్‌ను ప్రతినిధుల సభ అభిశంసించినప్పటికీ.. ఆ తీర్మానానికి సెనేట్‌లో ఆమోదం దక్కలేదు.

ట్రంప్‌పై సాక్ష్యాలున్నాయా?

నెలరోజులపాటు కొందరు అధికారుల నుంచి డెమోక్రాట్లు రహస్యంగా సాక్ష్యాలు సేకరించారు. మేనేజ్‌మెంట్‌, బడ్జెట్‌ కార్యాలయాలకు చెందిన కీలక అధికారులు మాత్రం సాక్ష్యం చెప్పేందుకు నిరాకరించారు. దీంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు జరగనున్న బహిరంగ విచారణపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. టీవీల్లో ఈ విచారణ ప్రక్రియను ప్రసారం చేయనున్నారు.

అభిశంసన సాధ్యమేనా?

ప్రతినిధుల సభలో డెమోక్రాట్లదే మెజారిటీ. అక్కడ అభిశంసన తీర్మానానికి ఆమోదం లభించడం లాంఛనమే. సెనేట్‌లో రిపబ్లికన్లకు ఆధిక్యం ఉంది. కాబట్టి తీర్మానానికి ఆమోదముద్ర పడే అవకాశాల్లేవు.

ఇదీ చూడండి:బ్రిటన్​ రాణి​ ఎలిజిబెత్​ 'రహస్య ప్రేమ'పై దుమారం!

Last Updated : Nov 13, 2019, 9:24 AM IST

ABOUT THE AUTHOR

...view details