మరికొద్ది గంటల్లో అమెరికా అధ్యక్ష పదవిని వీడనున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో ఆయన పదవీ బాధ్యతలు ఏ మేరకు విజయవంతంగా నిర్వహించారనే విషయంపై గ్యాలప్ సంస్థ పోల్ నిర్వహించింది. ఇందులో 34 శాతం మంది అమెరికన్లు మాత్రమే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించారని ఆమోదించారు. ఇందుకు సంబంధించిన పోల్ ఫలితాలను గ్యాలప్ విడుదల చేసింది. జనవరి 4నుంచి 15 మధ్య టెలిఫోనిక్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఈ ఫలితాలు వెల్లడించింది. క్యాపిటల్ భవనంలో హింస చెలరేగడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఈ సర్వే ప్రారంభమైంది.
అయితే ట్రంప్ నాలుగేళ్ల సగటును పరిశీలిస్తే 41 శాతం మంది ఆయన పాలనను ఆమోదించారు. ఇప్పటి వరకు మరే ఇతర అధ్యక్షుడికి ప్రజల నుంచి ఇంత తక్కువ అప్రోవల్ రేటింగ్ రాలేదు. నాలుగేళ్ల సగటు కనీసం 50శాతంగా ఉండేది. అప్రోవల్ రేటింగ్ 50 శాతం దాటని మొదటి అధ్యక్షునిగా ట్రంప్ నిలిచారు.