తెలంగాణ

telangana

ETV Bharat / international

కర్తార్​పుర్​, కశ్మీర్​ మధ్యవర్తిత్వంపై అమెరికా కీలక వ్యాఖ్యలు - Trump ready to mediate on Kashmir

కశ్మీర్​ సమస్య పరిష్కారానికై మధ్యవర్తిత్వం వహించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సుముఖంగా ఉన్నట్లు అమెరికా మరోమారు ప్రకటించింది. భారత్​-పాక్ కోరితే తప్పకుండా సమస్య పరిష్కారం దిశగా ట్రంప్​ తన వంతు సాయం అందిస్తారని తెలిపింది. కర్తార్​పుర్​ కారిడార్​పై భారత్​-పాక్​లు అవగాహన ఒప్పందం కుదుర్చుకోవటం స్వాగతించదగ్గ విషయమని కొనియాడింది.

కర్తార్​పుర్​, కశ్మీర్​ మధ్యవర్తిత్వంపై అమెరికా కీలక వ్యాఖ్యలు

By

Published : Oct 25, 2019, 9:54 AM IST

కశ్మీర్​ అంశంలో మరోసారి మధ్యవర్తిత్వం విషయాన్ని లేవనెత్తింది అమెరికా. భారత్​-పాక్​​లు కోరితే.. మధ్యవర్తిత్వం చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సిద్ధంగా ఉన్నట్లు అగ్రరాజ్య పరిపాలన విభాగం సీనియర్​ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇస్లామాబాద్​పై ఉందని ఉద్ఘాటించారు. భారత్​-పాక్​ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై ట్రంప్​ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఇరు దేశాల ప్రధానులతో పలుమార్లు కశ్మీర్​ అంశంపై చర్చించినట్లు గుర్తు చేశారు.

" ఇరుదేశాలు కోరినట్లయితే మధ్యవర్తిత్వం వహించేందుకు ట్రంప్​ సిద్ధంగా ఉన్నారు. కశ్మీర్​ అంశంలో బయటివారు కలుగజేసుకోవాల్సిన అవసరం లేదన్నది భారత్​ వాదన. నిర్మాణాత్మక చర్చలు చేపట్టే వాతావరణాన్ని అమెరికా ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుంది. కర్తార్​పుర్​ కారిడార్​పై అవగాహన ఒప్పందం కుదుర్చుకోవటం ఇరుదేశాల మధ్య విశ్వాసం పెంపొందించే చర్య. ఇది ప్రజాసంబంధాలను మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. "

- అమెరికా పరిపాలన విభాగం అధికారి.

చర్చలు, ఉగ్రవాదం ఒకేసారి జరగవనే భారత్ వైఖరికి అమెరికా మద్దతు ఇస్తుందా.. అని అడిగిన ప్రశ్నకు.. ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం పాకిస్థాన్​కు ఉందన్నారు. దీని ద్వారా ఇరుదేశాల మధ్య చర్చలకు ఆస్కారం లభిస్తుందని తెలిపారు.

గతంలోనూ..

కశ్మీర్​ అంశంపై మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఇప్పటికే పలుమార్లు ఉద్ఘాటించారు. అయితే కశ్మీర్‌ అంశం పూర్తిగా భారత్‌, పాక్‌ ద్వైపాక్షిక అంశమని, ఈ విషయంలో మధ్యవర్తిత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని భారత్‌ స్పష్టం చేసింది. తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని తేల్చిచెప్పింది.

ఇదీ చూడండి: ' ముందస్తుకు ఒప్పుకుంటేనే బ్రెగ్జిట్ గడువు పెంచుతా'

ABOUT THE AUTHOR

...view details