కరోనాపై పోరులో భాగంగా వివిధ దేశాధినేతలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరిపారు. వైరస్ కట్టడి, ఆర్థిక వ్యవస్థ సహా పలు కీలక అంశాలను ప్రస్తావించినట్టు శ్వేతసౌధం తెలిపింది.
సౌదీ రాజుతో...
వైరస్‌పై యుద్ధంలో తాజా సానుకూలాంశాలపై సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అల్ సౌద్‌తో చర్చించారు ట్రంప్. ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం అందించే అంశాలపైనా వీరిరువురూ చర్చించినట్టు శ్వేతసౌధం వెల్లడించింది. వీటితో పాటు ప్రాంతీయ, ద్వైపాక్షిక సమస్యలు, జీ7-జీ20 దేశాల నేతలుగా తమ మధ్య సహకార బంధంపైనా ట్రంప్-సల్మాన్ సమాలోచనలు చేశారు.
జర్మనీ ఛాన్సలర్...
కరోనా వైరస్‌పై జరుగుతున్న పరిశోధనలు, అమెరికా-జర్మనీ మధ్య ఆర్థిక సంబంధాల పునరుద్ధరణపై జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో చర్చించారు ట్రంప్. క్లిష్టమైన ప్రాంతీయ, ద్వైపాక్షిక సమస్యలనూ అమెరికా అధ్యక్షుడు ప్రస్తావించినట్టు శ్వేతసౌధం పేర్కొంది.
సౌదీ రాజు సల్మాన్, జర్మనీ ఛాన్సలర్ మెర్కెల్‌తో పాటు మలేషియా ప్రధాని ముహయిద్దీన్ యస్సిన్తోనూ చర్చలు జరిపారు ట్రంప్.
"ప్రాజెక్ట్ ఎయిర్ బ్రిడ్జ్, సరఫరా వ్యవస్థను తెరిచి ఉంచడానికి చేసిన కృషికి ముహయిద్దీన్ ప్రభుత్వానికి అధ్యక్షుడు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునేందుకు ఇరువురు నేతలు కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నారు. అమెరికా-మలేషియా సమగ్ర భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు కూడా ఇద్దరూ కట్టుబడి ఉన్నారు."
-- శ్వేతసౌధం ప్రకటన.
టెక్సాస్‌లో...
అమెరికాలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. నెల రోజుల అనంతరం.. టెక్సాస్‌లో పలు ఆంక్షలను సడలించి సెలూన్లు, బ్యూటీ పార్లల్ వంటి సేవలకు అనుమతులిచ్చింది అక్కడి ప్రభుత్వం. అయితే అందరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం నిబంధనను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఒకసారి ఒక కస్టమర్‌కు మాత్రమే సేవలందించాలని పేర్కొంది. మిగిలిన వారు ఆరు అడుగుల దూరం పాటిస్తూ బయట వేచి ఉండాలని సూచించింది.
పెళ్లిళ్లు, ఖననాలు, చర్చీలకు కూడా పలు నిబంధనలతో అనుమతులిచ్చింది టెక్సాస్ ప్రభుత్వం. ఒక్కో వరుసను విడిచిపెట్టి, ఒకరి మధ్య ఒకరు కనీసం ఆరు అడుగుల దూరం ఉండాలని స్పష్టం చేసింది.