తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​ నోట 'ఇజ్రాయెల్-పాలస్తీనా' శాంతి మంత్రం మాట!

ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేలు పెట్టారు. ఇజ్రాయెల్ అవిభక్త రాజధానిగా జెరూసలెం ఉంటుందని స్పష్టం చేశారు. పాలస్తీనా రాజధానిగా తూర్పు జెరూసలెం ఉంటుందని ప్రతిపాదించారు. అయితే ట్రంప్​ ప్రతిపాదనను పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తిరస్కరించారు.

Trump proposes Israel Palestine peace
ట్రంప్​ నోట 'ఇజ్రాయెల్-పాలస్తీనా' శాంతి మంత్రం..!

By

Published : Jan 29, 2020, 5:44 AM IST

Updated : Feb 28, 2020, 8:43 AM IST

ట్రంప్​ నోట 'ఇజ్రాయెల్-పాలస్తీనా' శాంతి మంత్రం మాట!

ఇజ్రాయెల్​-పాలస్తీనా ఘర్షణను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో పశ్చిమాసియా శాంతి ప్రణాళికను తాను రూపొందించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ వెల్లడించారు. ఇజ్రాయెల్ అవిభక్త రాజధానిగా జెరూసలెం ఉంటుందని స్పష్టం చేశారు.

తూర్పు జెరూసలెం పాలస్తీనా రాజధాని ఏర్పడుతుందని, అక్కడ యూఎస్​ రాయబార కార్యాలయం కూడా ఏర్పాటుచేస్తామని ట్రంప్ పేర్కొన్నారు. దీనిని శాంతివైపు వేసిన అతిపెద్ద ముందడుగుగా, చారిత్రకమైనదిగా ఆయన అభివర్ణించారు.

" నా ప్రతిపాదనలు ఇజ్రాయెల్, పాలస్తీనా రెండింటికీ విజయం చేకూరుస్తాయి. దీని వల్ల పాలస్తీనా స్వతంత్ర రాజ్యం అవుతుంది. ఇజ్రాయెల్ రక్షణకూ ఎలాంటి ప్రమాదం ఏర్పడదు. ఇది శాంతి స్థాపన కోసం తీసుకున్న ఓ పెద్ద నిర్ణయం. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే... ఇజ్రాయెల్ అవిభక్త రాజధానిగా జెరూసలెం కచ్చితంగా ఉండి తీరుతుంది. పాలస్తీనాకు సంబంధించి ఇది చాలా గొప్ప డీల్ అవుతుంది. స్వరాజ్యం సాధించాలన్న వారి కల నిజమవుతుంది."- డొనాల్డ్​ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

శాశ్వత శాంతి కోసం..

శ్వేతసౌధంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహూతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచంలో సుదీర్ఘకాలంగా ఉన్న ఒక సంఘర్షణను 'వాస్తవిక' దృక్పథంతో పరిష్కరించడానికి కృషిచేస్తున్నానని, ఇది పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు ఉపయోగపడుతుందన్నారు.

పాలస్తీనా భూభాగాన్ని రెట్టింపు చేయాలని, అక్కడ ఇజ్రాయెల్ కార్యకలాపాలను నాలుగేళ్లపాటు స్తంభింపజేయాలని ట్రంప్ తన ప్రణాళికలో పేర్కొన్నారు. దీని వల్ల ఇజ్రాయెల్​, పాలస్తీనాలు తమ స్వస్థలాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. పాలస్తీనా ఈ ఒప్పందానికి అంగీకరించి.. ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలని ట్రంప్​ కోరారు.

స్వతంత్ర రాజ్యంగా పాలస్తీనా

పాలస్తీనా ప్రజలు స్వతంత్ర రాజ్యం సాధించడానికి ఇదొక చారిత్రక అవకాశమని ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయమై పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్​కు లేఖ కూడా రాశానని ట్రంప్ చెప్పారు.

పాలస్తీనా ప్రతినిధులు లేకపోయినా..!

ఇజ్రాయెల్ ప్రధాని, ట్రంప్ మధ్య జరిగిన సమావేశంలో పాలస్తీనా అధికారులు పాల్గొనలేదు. అరబ్​ దేశాలైన ఒమన్​, యునైటెడ్ అరబ్​ ఎమిరేట్స్, బహ్రెయిన్​కు చెందిన రాయబారులు మాత్రమే ఉన్నారు.

చారిత్రక దినం

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ట్రంప్ ప్రణాళికను 1948 మే 14 ప్రణాళికతో పోల్చారు. ఇది 'చారిత్రక దినం' అని అభివర్ణించారు. (1948లో అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్​ ఇజ్రాయెల్​ను ఓ దేశంగా గుర్తించిన మొదటి నేతగా నిలిచాడు.)

తిరస్కరించిన పాలస్తీనా అధ్యక్షుడు

ట్రంప్ ప్రతిపాదనలను పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్​ పూర్తిగా తిరస్కరించారు. అర్థం పర్థం లేని ఈ ప్రతిపాదనలకు వెయ్యిసార్లు నో చెబుతున్నామన్నారు. ఇజ్రాయెల్ ఆక్రమణను అంతం చేయడానికి, తూర్పు జెరూసలెం రాజధానిగా దేశాన్ని స్థాపించడానికి పాలస్తీనియన్లు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు.

"మేము ఎవరి ముందూ మోకరిల్లం, లొంగిపోం. పాలస్తీనియా ప్రజలు శాంతియుత మార్గాల ద్వారా తమ రాజ్యాన్ని సాధించుకుంటారు."

- మహమూద్​ అబ్బాస్​, పాలస్తీనా అధ్యక్షుడు

గాజా ప్రాంతంలో వేలాది మంది పాలస్తీనియన్లు ట్రంప్ ప్రతిపాదనకు పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

ఐక్యరాజ్యసమితి స్పందన

తాజా పరిణామాలపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. 1967కు పూర్వం ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య జరిగిన శాంతి ఒప్పందాన్నే తాము గుర్తిస్తున్నామని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: ఒక దీవి.. ఓ మహిళ... 31 మంది సైనికులు

Last Updated : Feb 28, 2020, 8:43 AM IST

ABOUT THE AUTHOR

...view details