తెలంగాణ

telangana

ETV Bharat / international

పాఠశాలల పునఃప్రారంభంపై ట్రంప్ దూకుడు! - trump on schools reopen

లాక్​డౌన్​ ఎత్తివేత విషయంలో ఆరోగ్య నిపుణుల సూచనలకు విరుద్ధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికా అంటువ్యాధుల నిపుణులు ఆంథోనీ ఫౌచీ సూచనలను బేఖాతరు చేస్తూ పాఠశాలల పునఃప్రారంభంపై రాష్ట్రాల గవర్నర్లకు సూచనలు చేశారు ట్రంప్.

VIRUS-US-TRUMP-FAUCI
ట్రంప్ దూకుడు

By

Published : May 14, 2020, 12:12 PM IST

లాక్​డౌన్​ సడలింపుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా పాఠశాలలను పునఃప్రారంభించేందుకు కృషి చేయాలని రాష్ట్రాల గవర్నర్లకు ఆదేశాలు ఇచ్చారు.

అమెరికా అలర్జీ, అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌచీ సూచనలకు విరుద్ధంగా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికాలో లాక్​డౌన్​ ఎత్తివేతపై ఫౌచీ తాజాగా చేసిన వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకుని విమర్శించారు.

"నాకు తెలిసి పాఠశాలలను తప్పనిసరిగా తెరవాలి. దేశం వీలైనంత త్వరగా పూర్వస్థితికి రావాలి. పాఠశాలలు తెరుచుకోకపోతే ఇది సాధ్యం కాదు. దేశంలో ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు (ఆంథోనీ ఫౌచీ) అలసిపోయారు.

ఆయన యువతపై కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉందని చెప్పారు. పాఠశాలల విషయంలో ఆయనతో నేను ఏకీభవించటం లేదు. ఆయన చెప్పినవి నాకు ఆమోదయోగ్యం కావు."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఫౌచీ ఏం చెప్పారంటే..

ఫౌచీ తన నివేదికను సెనేట్​ కమిటీ ముందు మంగళవారం సమర్పించారు. కరోనాతో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఎంతో క్లిష్టంగా ఉన్నాయని ఫౌచీ తెలిపారు. ఒకవేళ అమెరికాలోని నగరాల్లో ఆర్థిక వ్యవస్థను హడావుడిగా తెరిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు.

వైరస్​ గురించి పూర్తిగా తెలియదని.. ఫలితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చిన్న పిల్లల విషయంలో మరింత శ్రద్ధ అవసరమని తెలిపారు. అయితే వ్యాక్సిన్ కనిపెట్టేవరకు పాఠశాలలను రద్దు చేయాలని సూచించటం లేదని పేర్కొన్నారు.

విభేదాలు...

ఈ పరిణామాలు చూస్తుంటే ట్రంప్, ఫౌచీ మధ్య వివాదం ముదిరినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే చాలా సార్లు ట్రంప్ నిర్ణయాలతో ఫౌచీ విభేదించారు. పలు సార్లు ట్రంప్ బహిరంగ ప్రకటనలను నీరు గార్చే విధంగా ఫౌచీ కరోనాకు సంబంధించి వివరణ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details