కరోనా నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయో తెలియదు. కానీ రాష్ట్రాల వారీగా చట్టసభలకు అభ్యర్థుల ఎంపిక.. ప్రచారాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో మిషిగన్ చట్టసభకు 73వ జిల్లా నుంచి రిపబ్లికన్ పార్టీ తరఫు అభ్యర్థిగా రాబర్ట్ రీగన్ ఎంపికయ్యారు. దీంతో ఆయన తన ప్రచారం మొదలుపెట్టారు.
అయితే తన తండ్రికి ఓటు వేయొద్దంటూ ఆయన కూతురు స్టెఫానీ రీగన్ ట్విట్టర్ వేదికగా స్థానిక ప్రజలను అభ్యర్థిస్తోంది. ఇటీవల ట్విట్టర్‌లో 'మీరు మిషిగన్‌లో ఉండి 18 ఏళ్లు నిండిన వారైతే.. దేవుడి ప్రేమను కోరుకుంటే.. మా తండ్రికి ఓటు వేయకండి. ఈ విషయం అందరికి చెప్పండి' అని ట్వీట్ చేసింది. అది కాస్తా వైరల్‌గా మారింది. ఎందుకు తండ్రికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మీడియా ఆమెను వివరణ కోరగా.. ఇంతకు మించి తానేమీ చెప్పలేనని, చెబితే తనకు హాని జరగొచ్చని తెలిపింది స్టెఫానీ.