అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమెరికా రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ట్రంప్ విఫలమయ్యారని.. ఫలితంగా దేశంలో 2లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
కీలకమైన విస్కాన్సిన్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బైడెన్.. ట్రంప్ తప్పులను క్షమించకూడదన్నారు.
"కరోనా సంక్షోభంతో ఇప్పటికే చాలా కాలం కలిసి జీవించేశాం. ఈ విషయం నాకు ఆందోళన కలిగిస్తోంది. మన దేశం, సంఘాలపై దాని ప్రభావాన్ని మనం పట్టించుకోవడం లేదు. ఇది నన్ను బాధించింది. పోయిన ప్రాణాల పట్ల బాధ, పరిస్థితుల పట్ల కోపాన్ని మనం వదులుకోకూడదు. దురదృష్టవశాత్తు.. అమెరికలో కరోనా మరణాల సంఖ్య 2 లక్షల మార్కును దాటింది. గత 180 రోజుల కన్నా రానున్న 90 రోజుల మరింత దారుణంగా ఉండే అవకాశముంది."