తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాపై ఆంక్షల బిల్లుకు ట్రంప్ ఆమోద ముద్ర

వీగర్​ ముస్లింల అణచివేతకు ప్రతిగా చైనాపై ఆంక్షలు విధించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఘింగ్​జియాంగ్ ప్రాంతంలో వీగర్లను నిర్బంధించిన చైనా అధికారులకు ఈ ఆంక్షలు వర్తించనున్నాయి. వీగర్లకు సంబంధించి చైనాపై ఇలా చర్యలు తీసుకోవటం ఇదే మొదటిసారి.

US-BILL-CHINA
ట్రంప్

By

Published : Jun 18, 2020, 2:04 PM IST

వీగర్​ ముస్లింలు, ఇతర మైనారిటీలపై అణచివేతకు వ్యతిరేకంగా చైనాపై ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమైంది. ఇందుకు సంబంధించి బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.

కొద్ది పాటి వ్యతిరేకతతో అమెరికా కాంగ్రెస్​ ఈ బిల్లును ఆమోదించింది. అనంతరం విదేశాంగ మంత్రి మైక్ పాంపియో లేకుండానే ఈ బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. ఝింగ్​జియాంగ్ ప్రాంతంలో వీగర్లతో పాటు ఇతర మైనారిటీలపై సామూహిక నిఘా, నిర్బంధం అమలు చేసిన అధికారులకూ ఆంక్షలు వర్తిస్తాయని ఈ బిల్లు స్పష్టం చేసింది.

"వీగర్​ మానవ హక్కుల విధాన చట్టం- 2020.. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినవారిని జవాబుదారీగా ఉంచుతుంది. అయితే చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారం కార్యనిర్వహక అధికారవర్గాలకు ఆంక్షలను రద్దు చేసే అవకాశం ఉంది. "

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

వీగర్లపై చైనా తీవ్ర అణచివేత ధోరణితో ప్రవర్తిస్తోంది. సుమారు 10 లక్షల మందిని అత్యంత కఠినమైన నిర్బంధంలో పెట్టింది. ఇందుకు సంబంధించి చైనాపై కఠిన చర్యలు తీసుకోవటం ఇదే తొలిసారి. అయితే ఈ నిర్ణయం.. ఇప్పటికే రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది.

చైనాపై ప్రభావం!

అమెరికా నిర్ణయంతో చైనాపై ఒత్తిడి మరింత పెరుగుతుందని కాంగ్రెస్ సభ్యులు భావిస్తున్నారు. ఈ ఆంక్షలతో ఘింగ్​జియాంగ్ రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలను అమలు చేసే చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారులపై ప్రభావం చూపనుందని అభిప్రాయపడ్డారు.

చైనా సాగిస్తున్న అణచివేత చర్యలను ఎప్పటికప్పుడు కాంగ్రెస్​కు తెలియజేయాల్సిన అవసరం ఉందని అమెరికా తీసుకొచ్చిన తాజా చట్టం నొక్కి చెబుతోంది. వీగర్లపై సామూహిక నిఘా, నిర్బంధం గురించి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేస్తోంది.

గొప్ప రోజు..

అమెరికా నిర్ణయంపై ట్రంప్​నకు వీగర్ ముస్లింల హక్కుల కోసం పోరాడుతున్న న్యాయవాది న్యూరీ టర్కెల్ కృతజ్ఞతలు తెలిపారు. వీగర్ ముస్లింలు, అమెరికాకు ఇది గొప్ప రోజు అని వ్యాఖ్యానించారు.

వీగర్ల అణచివేత..

విస్తారమైన వనరులున్న ఘింగ్​జియాంగ్ ప్రాంతంలో వీగర్ల వేర్పాటు వాదాన్ని చైనా కఠినంగా వ్యవహరిస్తోంది. 2014 నుంచి వీగర్లను సామాజికంగానూ అణచివేయటానికి చైనాకు చెందిన హాన్​ తెగలను ఈ రాష్ట్రానికి తరలిస్తోంది. అయితే వీగర్ల అణచివేతపై వస్తోన్న ఆరోపణలను చైనా ఖండిస్తూ వస్తోంది.

ఝింగ్​జియాంగ్​లో మూలవాసులు వీగర్ ముస్లింలు. చాలా ఏళ్లుగా చైనా నుంచి స్వాతంత్య్రం కోసం డిమాండ్ చేస్తున్నారు. చైనా అణచివేతతో దశాబ్దాలుగా చైనా నుంచి వేల మంది వీగర్లు వలస వెళ్లి పాకిస్థాన్​లో ఆశ్రయం పొందారు.

ABOUT THE AUTHOR

...view details