తెలంగాణ

telangana

ETV Bharat / international

'పారిస్'​ నుంచి వైదొలిగేందుకు అమెరికా ప్రక్రియ​ షురూ! - పారిస్​ వాతావరణ ఒప్పందం తాజా వార్తలు

భూతాపం నుంచి భూగోళాన్ని రక్షించే ఉద్దేశంతో కుదుర్చుకున్న 'పారిస్ పర్యావరణ ఒప్పందం 2015' నుంచి వైదొలగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇందుకోసం ఉపసంహరణ ప్రక్రియను అమెరికా నేడు మొదలు పెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి లేఖ రాయాల్సి ఉంది.

'పారిస్'​ నుంచి వైదొలిగేందుకు అమెరికా ప్రక్రియ​ షురూ!

By

Published : Nov 4, 2019, 5:31 AM IST

'పారిస్​ పర్యావరణ ఒప్పందం 2015'.. పారిశ్రామికీకరణతో వేడెక్కుతోన్న భూగోళాన్ని రక్షించేందుకు.. ఏర్పాటు చేసుకున్న ఒప్పందం. ఈ ఒప్పందంపై దాదాపు 200 దేశాలు సంతకాలు చేశాయి. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్​ ఒబామా ఈ ఒప్పందానికి అంగీకారం తెలిపారు. 2016 నవంబర్​ 4 నుంచి ఇది అమలులోకి వచ్చింది.

అయితే డొనాల్డ్​ ట్రంప్​ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక... ఈ ఒప్పందం భారత్, చైనాలకు అనుకూలంగా ఉందని, అమెరికా ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ట్రంప్​ ఆరోపించారు. ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయితే ఒప్పందం ప్రకారం సంతకం చేసిన ఏ దేశమూ.. 3 ఏళ్ల వరకు వైదొలగడానికి ఆస్కారం లేదు.

నేటితో ఆ సమయం ముగియడం వల్ల ఒప్పందం నుంచి వైదొలిగే ప్రక్రియను అమెరికా మొదలుపెట్టే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం ముందుగా ఐరాసకు లేఖ రాయాలి. ఈ ప్రక్రియ ముగియడానికి ఏడాది సమయం పట్టొచ్చు. ఈ లోపు 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయిపోతాయి. అయితే ఎన్నికల్లో ట్రంప్​ కాకుండా.. మరెవరైనా అధ్యక్షుడిగా ఎన్నికైతే.. వారి నిర్ణయం మేరకు 30 రోజుల్లో తిరిగి ఒప్పందంలో చేరవచ్చు.

ఒప్పందం నుంచి వైదలొగాలనే ట్రంప్​ నిర్ణయంపై ప్రతిపక్ష డెమోక్రాట్లు, ప్రజాసంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి.

పారిస్ ఒప్పందం అంటే?

పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాల అధిక వాడకం, పారిశ్రామికీకరణతో భూగోళం వేడెక్కుతోంది. ఫలితంగా కార్బన్‌డయాక్సైడ్డ్ వంటి గ్రీన్‌హౌస్ వాయువుల మోతాదు పెరిగి అకాల వర్షాలు, వరదలు, కరువు వంటి అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీనిని నివారించేందుకు ఈ శతాబ్దం చివరికి భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న లక్ష్యంతో 2015లో ఏర్పాటు చేసుకున్న ఒప్పందమే పారిస్ ఒప్పందం. దీనిపై దాదాపు 200 దేశాలు సంతకాలు చేశాయి. సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం, కర్బన ఉద్గారాల తగ్గింపు వంటి చర్యలతో దీన్ని సాధించాలన్నది ఒప్పంద సంకల్పం.

ABOUT THE AUTHOR

...view details