నవంబర్ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికలపై మొదటి నుంచే ఆరోపణలు చేస్తున్నారు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. డెమొక్రటిక్ అభ్యర్థి, ఎన్నికల విజేత జో బైడెన్‌కు అనుకూలంగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. తన ఓటమిని అంగీకరించేందుకు నిరాకరిస్తూ.. ఎన్నికల ఫలితాలపై న్యాయపోరాటానికి దిగారు. తాజాగా సుప్రీం కోర్టు తలుపుతట్టారు ట్రంప్.
ట్రంప్ ఇంప్లీడ్ పిటిషన్
జార్జియా, మిషిగన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్లోని మొత్తం 62 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు చెల్లవంటూ టెక్సాస్ అటార్నీ జనరల్ కేన్ పాక్ట్సన్ సుప్రీం కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో తనను కూడా కక్షిదారుగా చేర్చుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు ట్రంప్.
" త్వరలోనే ధైర్యం అనే పదం గురించి తెలుసుకుంటాం. దేశాన్ని రక్షిస్తాం. అన్ని స్వింగ్ స్టేట్స్లో నా ప్రత్యర్థి కన్నా.. వేల సంఖ్యలో లీగల్ ఓట్లు సాధించా. ఓటింగ్ తర్వాత సేకరించిన డేటా ప్రకారం.. అక్రమాలు జరిగితే తప్ప నేను ఓడిపోవటం అసాధ్యం అని తేలింది."