మెక్సికో సరిహద్దు గోడపై తన పంతం నెగ్గించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపక్రమించారు. కాంగ్రెస్ వ్యతిరేకించినా అత్యయిక స్థితి కొనసాగించేలా విచక్షణ(వీటో) అధికారాన్ని ఉపయోగించారు. వీటోను ట్రంప్ పదవీకాలంలో ఉపయోగించటం ఇదే మొదటిసారి.
"అత్యయిక స్థితిపై తీర్మానించేందుకు కాంగ్రెస్కు పూర్తి స్వేచ్ఛ ఉంది. అలాగే వీటోను ఉపయోగించుకునేందుకు నాకు అంతే స్వేచ్ఛ ఉంది."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చేందుకు తాపత్రయ పడట్లేదని ప్రకటించారు ట్రంప్. మరోసారి అధ్యక్షునిగా ఉంటానా లేదా అన్నది తెలియడానికి మరో 18 నెలలు సమయం ఉందని పేర్కొన్నారు.
అత్యయిక స్థితిని వ్యతిరేకిస్తున్న డెమొక్రాట్లకు సెనేట్లో 12 మంది రిపబ్లికన్ సభ్యులూ మద్దతునిస్తున్నారు. ట్రంప్ వీటోను బుట్టదాఖలు చేసేందుకు కాంగ్రెస్లో 2/3వ వంతు సభ్యులు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ఎలాగైనా అత్యయిక స్థితి తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ సభ్యులు.
ఎమర్జెన్సీ నిర్ణయం రాజ్యాంగబద్ధమైనది కాదని డెమొక్రాట్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల అటార్నీ జనరల్స్ సైతం వాదిస్తున్నారు.