అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రధాన ప్రత్యర్థి.. జో బైడెన్. మరోసారి అగ్రరాజ్యం అధ్యక్షుడిగా శ్వేతసౌధంలో కొనసాగాలంటే.. బైడెన్‌ను ఓడించి తీరాలి. కానీ, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు ట్రంప్. ఇప్పటికే ఉపాధ్యక్ష అభ్యర్థుల డిబేట్ తర్వాత.. కమల చాలా భయంకరంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. జో బైడెన్ ఎన్నికల్లో గెలిస్తే నెలల్లోనే 'కమ్యూనిస్ట్ కమల' అధికారం చేపడతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కమలపై విమర్శలు ఎందుకు ?
ట్రంప్.. డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి, భారత సంతతి మహిళ కమలా హారిస్‌పై విమర్శలు చేయటానికి ప్రధాన కారణం.. బైడెన్‌ను ఇరకాటంలో పెట్టడమే. కరోనా నుంచి కోలుకుని ప్రచారం మొదలు పెట్టిన అనంతరం ట్రంప్ తన అజెండాను పూర్తిగా మార్చేశారు. కమలపైనే పూర్తిస్థాయి దృష్టిసారించారు. ఈ నేపథ్యంలోనే డెమొక్రాట్లకు ఓటేస్తే.. స్పీకర్ నాన్సీ పెలోసీ బైడెన్‌ను గద్దె దింపి కమలను అధ్యక్ష పీఠంపై కూర్చోబెడతారని ప్రజలను హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి: 'బైడెన్ గెలిస్తే నెలలోపే కమ్యూనిస్ట్ కమల అధికారం చేపడతారు'
అధ్యక్షుడు ట్రంప్.. కమలపై వ్యక్తిగత దూషణకూ వెనకాడటం లేదు. లింగ వివక్ష, జ్యాత్యాంహకారపూరిత విద్వేష వ్యాఖ్యలు సైతం చేస్తున్నారు. కమల మాత్రం రిపబ్లికన్ల విమర్శలపై ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నారు.
'ముందస్తు' సంకేతాలే కారణం!
ఇన్నాళ్లూ ట్రంప్... బైడెన్ లక్ష్యంగా విమర్శలు చేశారు. అయితే... ఇప్పటికే ముందస్తు పోలింగ్ జరుగుతున్న చాలా రాష్ట్రాల్లో.. బైడెన్ వర్గం దూసుకుపోతున్నట్లుగా నివేదికలు వస్తున్నాయి. తమ వ్యూహం ఫలించలేదని భావించిన రిపబ్లికన్ ప్రచార బృందం... కమలపైకి దృష్టి మరల్చింది. బైడెన్‌ను నోట్లో నాలుక లేని వ్యక్తిగా చిత్రీకరిస్తూ.. కమలను 'దూకుడు' మనిషిగా విమర్శిస్తున్నారు అధికార పార్టీ నేతలు.
ఓటర్లు గనుక కమలా హారిస్ అతి దూకుడు స్వభావం అర్థం చేసుకోగలిగితే.. ఆమెంత ప్రమాదకరమైన మహిళో బోధపడుతుంది.
-గింగ్రిచ్, ట్రంప్ విధేయుడు