కరోనా వైరస్ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస్పత్రిలో చేరారు. వాషింగ్టన్ శివారు ప్రాంతం బేథెస్డాలో ఉన్న వాల్టర్ రీడ్ మిలిటరీ ఆస్పత్రిలో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది.
తనకు వైరస్ సోకినట్లు ప్రకటించినప్పటి నుంచి శ్వేతసౌధంలోనే క్వారంటైన్‌లో ఉన్న ఆయన.. వైద్యుల సూచన మేరకు శుక్రవారం సాయంత్రం ఆస్పత్రిలో చేరేందుకు అంగీకరించారు. మాస్కు ధరించి హెలికాప్టర్‌లో ఆస్పత్రికి చేరుకున్నారు.
అక్కడి నుంచే ఆయన విధులు నిర్వర్తించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతానికి ఎన్నికల ప్రచారానికి పూర్తిగా దూరంగా ఉండే అవకాశం ఉందన్నారు. వర్చువల్‌గా ప్రచారాల్లో పాల్గొంటారని సమాచారం.
నేను ఆరోగ్యంగానే ఉన్నా..
తాను, ప్రథమ మహిళ మెలనియా ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. వాల్టర్ రీడ్‌కు చేరుకునే ముందు 18 సెకన్ల నిడివి గల ఓ వీడియోను ట్వీట్ చేశారు.
"నాకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేను వాల్టర్ రీడ్ ఆస్పత్రికి వెళ్తున్నాను. నాకు తెలిసి నేను బాగానే ఉన్నాను. అయినా, అన్నీ సవ్యంగా ఉండాలనే మేం ఆస్పత్రికి వెళ్తున్నాం. ప్రథమ మహిళ కూడా బాగానే ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. నేను ఇది ఎప్పటికీ మర్చిపోలేను"
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు