అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై.. సెనెట్‌లో రెండో దశ విచారణ మంగళవారం ప్రారంభమైంది. సెనెట్ ప్రొటెం స్వీకర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన పాట్రిక్ లీహి దీనిపై విచారణ చేపట్టారు. అభిశంసన ఆర్టికల్‌ను ప్రతినిధుల సభ.. సెనెట్‌కు సోమవారం పంపించింది. అమెరికాలో క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు జరిపిన దాడికి బాధ్యుడు ట్రంపేనని డెమొక్రాట్లు ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 9 నుంచి ఇరు పక్షాలు తమ వాదనను వినిపించనున్నాయి.
విచారణ వద్దంటున్న రిపబ్లికన్లు..
ట్రంప్ అభిశంసన విచారణ అడ్డుకోవడానికి రిపబ్లికన్ సెనెటర్లు ప్రయత్నిస్తున్నారు. ఈ అభిశంసన.. రాజ్యాంగ విరుద్ధమంటూ కెంటకీకి చెందిన రిపబ్లికన్ సెనెటర్ ర్యాండ్ పాల్.. వాదిస్తున్నారు. అయితే.. ట్రంప్ అభిశంసన చట్టబద్ధమేనంటూ 55-45 ఓట్ల తేడాతో సెనెట్ అంగీకరించింది. టెక్సాస్‌కు చెందిన మరో సెనెటర్.. మాజీ అధ్యక్షులపై అభిశంసన విచారణ మొదలుపెడితే, మరి ఆ తర్వాత ఒబామాపై కూడా ఇదే తరహా చర్యలు ప్రారంభిస్తారా అని ప్రశ్నించారు.