గతంలో ఏ అమెరికా ప్రభుత్వం చేయని విధంగా భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో కృషి చేశారని శ్వేతసౌధం వెల్లడించింది. భవిష్యత్తులో కూడా రెండు దేశాల మధ్య కీలక భాగస్వామ్యాలను ఆయన కొనసాగిస్తారని పేర్కొంది. ఈ మేరకు శ్వేతసౌధం జాతీయ భద్రతా మండలి సీనియర్ అధికారి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు.
"భారత్తో సంబంధాలకు ట్రంప్ ప్రాధాన్యమిచ్చారు. గత మూడున్నరేళ్లుగా అన్ని రంగాల్లో రెండు దేశాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కృషి చేశారు. కొవిడ్ సంక్షోభం అనంతరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించేందుకు, సరఫరా గొలుసులను బహుముఖం చేసేందుకు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ కోసం కీలక భాగస్వామ్యం నెలకొల్పేందుకు తన వంతు కృషి ట్రంప్ చేస్తూనే ఉంటారు. సాయుధ ఎంక్యూ-9 మానవరహిత విహంగ నిఘా వ్యవస్థను అమెరికా నుంచి పొందుతున్న మొట్టమొదటి ఒప్పందేతర మిత్రదేశంగా భారత్ ఉందంటే అందుకు ట్రంపే కారణం. ఫిబ్రవరి 24-26 తేదీల్లో ట్రంప్ భారత్లో పర్యటించినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ రెండు దేశాల మధ్య బంధాన్ని సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెంచారు. ట్రంప్ 2017లో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయ్యాక శ్వేతసౌధాన్ని మొదటగా సందర్శించిన నాయకుల్లో మోదీ ఉన్నారు.