తెలంగాణ

telangana

ETV Bharat / international

డబ్ల్యూహెచ్​ఓకు అమెరికా షాక్​- నిధులు నిలిపివేత​ - Donald Trump

ప్రపంచ ఆరోగ్య సంస్థకు దాదాపు 500 మిలియన్​ డాలర్ల నిధులను నిలిపివేసింది అమెరికా. కరోనా ముప్పుపై ప్రపంచాన్ని హెచ్చరించడంలో డబ్లూహెచ్​ఓ విఫలమైనందని ఆరోపిస్తూ.. యూఎస్​ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే నిధుల నిలిపివేతకు ఇది సరైన సమయం కాదని వాపోయారు ఐక్యరాజ్యసమితి అధినేత ఆంటోనియో గుటేరస్​.

Trump halts US funding for World Health Organisation
డబ్ల్యూహెచ్​ఓకు అమెరికా షాక్​-భారీగా నిధులు నిలిపివేత​

By

Published : Apr 15, 2020, 11:06 AM IST

Updated : Apr 15, 2020, 11:36 AM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు అమెరికా అందించే నిధులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. కరోనా మహమ్మారి ముప్పుపై ప్రపంచాన్ని హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్​ఓ విఫలమైందని ఆరోపిస్తూ.. ట్రంప్​ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశంపై పూర్తిస్థాయిలో సమీక్షించేందుకూ సిద్ధమయ్యారు ట్రంప్​. తొలినాళ్లలో వైరస్‌ వ్యాప్తిని డబ్ల్యూహెచ్‌ఓ కావాలనే కప్పిపుచ్చిందన్నది ఆయన ప్రధాన ఆరోపణ.

అమెరికా తాజా నిర్ణయంతో డబ్ల్యూహెచ్​ఓకు దాదాపు 500 మిలియన్​ డాలర్ల నిధులు నిలిచిపోనున్నాయి.

అత్యధిక నిధులిస్తున్నాం.. మాకు హక్కుంది

కరోనా విషయంలో డబ్ల్యూహెచ్​ఓ చైనాకు పక్షపాతిగా వ్యవహరించిందని మొదట్నుంచి ఆరోపిస్తున్నారు ట్రంప్​.

" ప్రపంచ ఆరోగ్య సంస్థకు అత్యధిక నిధులు అందిస్తున్నందున.. సంస్థ బాధ్యతాయుతంగా నడుచుకునేలా ఆదేశించే హక్కు అమెరికాకు ఉంది. అమెరికా ఏడాదికి దాదాపు 400 నుంచి 500 మిలియన్​ డాలర్ల నిధులు డబ్ల్యూహెచ్​ఓకు అందిస్తుంది. చైనా కేవలం 40 మిలియన్​ డాలర్లే అందిస్తోంది."

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

ఆది నుంచి ఏకీభవించలేదు..

అమెరికా తీసుకున్న చాలా నిర్ణయాల్ని డబ్ల్యూహెచ్‌ఓ వ్యతిరేకించిందని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. కానీ, డబ్ల్యూహెచ్‌ఓతో ఏకీభవించని తాను చైనాకు రాకపోకలపై ఆంక్షలు అమలు చేశామని తెలిపారు. తద్వారా ఎంతో మంది ప్రాణాల్ని రక్షించామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అనారోగ్య ముప్పు తలెత్తినప్పుడు ప్రపంచ దేశాలూ సరైన సమాచారం కోసం డబ్ల్యూహెచ్‌ఓపై ఆధారపడతాయని గుర్తుచేశారు ట్రంప్​. కానీ, ఆ సంస్థ మాత్రం ఈ కనీస బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైందని మండిపడ్డారు.

డిసెంబరులోనే ఆధారాలున్నప్పటికీ..

కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందనడానికి చైనాలో డిసెంబర్‌లోనే సరైన ఆధారాలు ఉన్నాయని.. కానీ, డబ్ల్యూహెచ్‌ఓ వాటిపై ఏమాత్రం దృష్టి సారించలేదన్నారు ట్రంప్. పైగా కొవిడ్‌-19 అంటువ్యాధి కాదన్న చైనా వాదనకు మద్దతుగా నిలిచిందని దుయ్యబట్టారు. జనవరి రెండో వారం పూర్తయ్యేనాటికి సామూహిక వ్యాప్తి జరుగుతుందనడానికి అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ.. ప్రపంచాన్ని హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్‌ఓ ఉదాసీనంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితి ప్రకటించడంలోనూ డబ్ల్యూహెచ్‌ఓ జాప్యం చేసిందని ఆరోపించారు ట్రంప్​. ఈ పరిణామాల వల్లే ఇప్పుడు వైరస్‌ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోందన్నారు.

ఇది సమయం కాదు

అమెరికా నిర్ణయాన్ని తప్పుబట్టారు ఐక్యరాజ్యసమితి చీఫ్​ ఆంటోనియో గుటేరస్​. డబ్ల్యూహెచ్​ఓకు నిధులు నిలిపివేసేందుకు ఇది సరైన సమయం కాదన్నారు. కరోనా మహమ్మారితో పోరాడుతున్న సమయంలో డొనాల్డ్​ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని గుటేరస్​ వెల్లడించారు.

Last Updated : Apr 15, 2020, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details