అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డా. ఫౌచీపై విరుచుకుపడ్డారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఫౌచీ, ఆయన బృందం మాటలకు ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సొంత యంత్రాంగంలోని వారిపై ట్రంప్ విమర్శించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఇటీవలే ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఫౌచీ. ట్రంప్‌నకు కరోనా సోకిందన్న వార్త విని తనకు ఆశ్చర్యం కలగలేదని.. భారీ వేడుక నిర్వహించిన అనంతరం ఇది సహజమే అని వ్యాఖ్యానించారు. ఆ వేడుకలో ఎవరూ సరిగ్గా మాస్కులు పెట్టుకోలేదని.. భౌతిక దూరాన్ని కూడా పాటించలేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఫౌచీపై మండిపడ్డారు ట్రంప్.
"ఫౌచీతో పాటు ఈ ఇడియట్స్ మాటలు వినీ విని ప్రజలు విసిగిపోయారు. టీవీకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రతిసారీ బాంబు పేలినట్టు ఉంటుంది. అయినా ఆయన్ని విధుల నుంచి తొలగించలేము. కానీ ఆయన దారుణంగా విఫలమయ్యారు."
--- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.