అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. ట్రంప్ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 3న జరగనున్న ఎన్నికలు కాస్త ఆలస్యంగా జరగొచ్చని డొనాల్డ్ గురువారం ట్విట్టర్ వేదికగా అభిప్రాయపడ్డారు. మెయిల్ ఇన్ ఓటింగ్ ఫలితాల్లో మోసాలు జరగడమే ఇందుకు కారణంగా ఆయన ఆరోపించారు.
"యూనివర్సెస్ మెయిల్ ఇన్ ఓటింగ్-2020 మోసపూరితం. ఇది యుఎస్‌ఎకు గొప్ప ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రజలు సరిగ్గా, సురక్షితంగా ఓటు వేసే వరకు ఎన్నికలు ఆలస్యం అవుతాయా?" అని ట్రంప్ ప్రశ్నించారు.
అన్ని మెయిల్ ఓట్లు ఉన్న రాష్ట్రాల్లో.. మెయిల్-ఇన్ ఓటింగ్ ద్వారా మోసం జరిగిందని ఇప్పటికైతే ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పటికే ఐదు రాష్ట్రాలు మెయిల్-ఇన్ బ్యాలెట్లపై ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. విదేశీ శత్రువులు ఓటుకు అంతరాయం కలిగించకుండా చూసుకోవడానికి అవసరమైన భద్రతలు తమ వద్ద ఉన్నాయని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించాయి.