ప్రపంచంలో అత్యంత పటిష్ఠమైన భద్రత ఉండే అమెరికా అధ్యక్షుడి భవనం శ్వేతసౌధానికి కరోనా సెగ తగిలింది. అందులో పని చేసే ఇద్దరు అధికారులకు కరోనా పాజిటివ్ తేలటం ఆ దేశ పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నడూ లేనంతగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
అమెరికాలో ప్రత్యేక భద్రత వర్గంలోని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో సహా ముగ్గురు ఉన్నత వైద్య నిపుణులు కరోనా కారణంగా క్వారంటైన్లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ట్రంప్ భద్రత కోసం కొత్త రక్షణ చర్యలు తీసుకున్నారు అధికారులు.
ఇందులో భాగంగానే శ్వేతసౌధం పశ్చిమ విభాగానికి వచ్చేవారు కచ్చితంగా మాస్కులు ధరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిబంధన అధ్యక్షుడికి మాత్రం వర్తించదు. శ్వేతసౌధంలోని రోజ్ గార్డెన్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో అందరూ మాస్కులతో దర్శనం ఇవ్వటం ఇదే తొలిసారి.
చర్యలకు సిద్ధమైన ట్రంప్..
ఈ దృశ్యం అమెరికాలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెబుతోంది. అయితే అమెరికా ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణకు ట్రంప్ పట్టుబడుతున్న సమయంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అగ్రరాజ్యంలో కరాళ నృత్యం చేస్తోన్న కరోనా నుంచి ప్రజలకు భరోసా కల్పించటం ట్రంప్ ముందున్న అతి పెద్ద సవాలు.