అమెరికాలో అధికార మార్పిడిపై అనిశ్చితి కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేందుకు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ససేమిరా అంటున్నారు. అధికారాలను బైడెన్‌కు బదలాయించేందుకు నిరాకరిస్తున్నారు. అయితే- ఎన్నికల్లో అక్రమాలేం జరగలేదంటూ మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ వంటి సొంత పార్టీ నేతలు ప్రకటించడం, పదవి నుంచి హుందాగా దిగిపోవడమే మేలంటూ కొందరు కుటుంబ సభ్యులూ సూచిస్తుండటం ట్రంప్‌పై క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు- అధికారిక ప్రకటన వస్తేగానీ అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించినట్లు తాము గుర్తించబోమని చైనా, రష్యా స్పష్టం చేశాయి.
సంక్లిష్టంగా అధికార మార్పిడి!
సాధారణంగా అమెరికాలో ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థిని కాబోయే అధ్యక్షుడిగా 'జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ (జీఎస్‌ఏ)' విభాగం గుర్తిస్తుంది. అనంతరం అధికార మార్పిడి ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే- ట్రంప్ తన ఓటమిని ఇప్పటివరకూ అంగీకరించలేదు. దీంతో బైడెన్‌ను విజేతగా జీఎస్‌ఏ ఇంకా గుర్తించలేదు. ప్రస్తుతం ఆ విభాగం చీఫ్‌గా ఎమిలీ ముర్ఫీ ఉన్నారు. ఆమెను ట్రంపే నియమించారు. కాబట్టి జీఎస్‌ఏ ప్రస్తుత అధ్యక్షుడికి అనుకూలంగా వ్యవహరిస్తుందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటిని నిజం చేస్తూ.. అధికార మార్పిడికి సంబంధించిన ఓ లేఖపై సంతకం చేసేందుకు ఎమిలీ సోమవారం నిరాకరించారు. వాస్తవానికి అధికారాల బదలాయింపు ప్రక్రియ సజావుగా సాగేందుకుగాను ప్రతి ఫెడరల్ భవనంలో కాబోయే అధ్యక్షుడి బృందానికి కార్యాలయ స్థలం కేటాయించాలి. కోటి డాలర్ల నిధులు కూడా మంజూరు చేయాలి. లేఖపై సంతకానికి ఎమిలీ నిరాకరించడం వల్ల ప్రస్తుతం బైడెన్ బృందానికి అవేవీ అందవు. ట్రంప్ నుంచి అనుమతి వస్తేగానీ జీఎస్‌ఏ బైడెన్ విజయాన్ని అధికారికంగా గుర్తించే అవకాశాల్లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అధికార మార్పిడి వ్యవహారం మరింత సంక్లిష్టంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
పెరుగుతున్న ఒత్తిడి