అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అయితే రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయిన ట్రంప్.. గురువారం వైట్‌హౌస్‌లో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో ట్రంప్ ప్రసంగించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. వైట్‌హౌస్ పరిసరాలను రాజకీయ సమావేశాల కోసం వాడుకోవడం, హాజరైన అతిథులు కనీసం కరోనా నిబంధనలు పాటింకపోవండపై ఇప్పటికే ప్రత్యర్థులనుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్.. తాజాగా ప్రభుత్వ అధికారులను రాజకీయ ప్రచారంలో భాగస్వామ్యం చేయడంపైనా మండిపడుతున్నారు. ట్రంప్ హ్యాచ్ చట్టాన్ని అతిక్రమించారని ఆరోపిస్తున్నారు.
ట్రంప్‌పై ప్రత్యర్థుల ఆరోపణల నేపథ్యంలో యూఎస్ చట్టాలపై పట్టున్న భారతీయ ప్రముఖ లాయర్ డాక్టర్ సూరత్ సింగ్ 'ఈటీవీ భారత్'తో మాట్లాడారు.
"ట్రంప్ సాంకేతికంగా హ్యాచ్ చట్టాన్ని ఉల్లంఘించలేదు. కానీ అతను అమెరికా ప్రభుత్వాన్ని నడిపించే అన్ని నిబంధనలను తుంగలోకి తొక్కారు" అని అభిప్రాయపడ్డారు సూరత్ సింగ్. ఈ సుప్రీంకోర్టు లాయర్ ఒబామాతో కలిసి హార్వర్డ్‌లో చదువుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలోనూ ట్రంప్ సమావేశంలో భౌతిక దూరం పాటించకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు.
హ్యాచ్ చట్టం అంటే...?
1939 నాటి హ్యాచ్ చట్టం.. హానికరమైన రాజకీయ కార్యకలాపాలను నివారిస్తుంది. ఇది యూఎస్ ఫెడరల్ చట్టాన్ని ప్రతిబింబిస్తుంది. ఫెడరల్ ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖలోని సివిల్ సర్వీస్ ఉద్యోగులు.. కొన్ని రకాల రాజకీయ కార్యకలాపాలకు పాల్పడకుండా నిషేధించడం దీని ప్రధాన ఉద్దేశం. ఇందులో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడికి మినహాయింపు ఉంటుంది. ఇది ఆగస్టు 2, 1939న చట్టంగా మారింది. ఈ చట్టానికి న్యూ మెక్సికోకు చెందిన సెనేటర్ కార్ల్హ్యాచ్ పేరు మీద పెట్టారు. దీన్ని చివరిగా అధ్యక్షుడు ఒబామా హయాంలో 2012లో సవరించారు.
ఆగస్టు 27న వైట్‌హౌస్ వేదికగా రిపబ్లికన్ల తరఫున తన నామినేషన్‌ను అంగీకరిస్తూ.. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షల్(ఆర్ఎన్సీ)లో అధికారికంగా ప్రకటించారు. అయితే ఇందులో ప్రభుత్వ అధికారులను భాగస్వామం చేయడం సాంకేతికంగా తప్పు కానప్పటీ.. నైతికంగా తప్పేనని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.