అధ్యక్ష అభ్యర్థుల మధ్య ముఖాముఖి సంవాదంలో డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిపై.. డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ మండిపడ్డారు. ఆయన తీరు అధ్యక్ష హోదాకు అప్రతిష్ఠ కలిగించేలా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. "గత నాలుగేళ్లలో చేసిన విధంగానే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి హోదాను మరోసారి తగ్గించారు" అని ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు కమల. అదే సమయంలో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు మద్దతుగా నిలిచారు. అమెరికా ప్రజలే తనకు ముఖ్యమని బైడెన్ స్పష్టం చేశారని అన్నారు.
"అభ్యర్థుల మధ్య బేధాలను తెలుసుకునే సామర్థ్యం అమెరికా ప్రజలకు ఉంది. ఈ రాత్రి(డిబేట్ జరిగిన రోజు) తేడా స్పష్టంగా తెలిసింది. ఓవైపు జో బైడెన్.. కెమెరాలను నేరుగా చూస్తూ అమెరికా ప్రజలతో సంభాషించారు. వేదికపై ఉన్నప్పుడు ప్రజలే ముఖ్యమని భావించారు. అమెరికాలోని కుటుంబాలే ప్రధానమనుకున్నారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్.. గత నాలుగేళ్లలో చేసిన విధంగానే అమెరికా అధ్యక్ష పదవి హోదాను ఆయన మరోసారి తగ్గించారు."
-కమలా హారిస్, డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి
అంతకుముందు.. ట్విట్టర్ వేదికగా ట్రంప్‌పై విమర్శలు కురిపించారు కమల. నాలుగేళ్ల పాలలో దేశంలో జాతి విద్వేషాలకు ఆజ్యం పోశారని ట్రంప్‌పై ధ్వజెమెత్తారు. ఆయనను గద్దెదించడం మాత్రమే సరిపోదని.. దేశంలో వర్ణ వివక్షను సమూలంగా రూపుమాపేందుకు తమ వద్ద సమగ్ర ప్రణాళిక ఉందని తెలిపారు.