తెలంగాణ

telangana

ETV Bharat / international

'డబ్ల్యూహెచ్​ఓకు అమెరికా నిధులు ఆపేస్తే చైనాకే లాభం' - LOCKDOWN EFFECT ON WORLD

డబ్ల్యూహెచ్​ఓకు అందించే నిధుల్ని అమెరికా నిలిపేయడం వల్ల రాజకీయంగా చైనా విజయం సాధించినట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో డబ్ల్యూహెచ్​ఓను విడిచిపెట్టడం తగదని చెబుతున్నారు.

TRUMP-WHO- CHINA GAIN
'డబ్ల్యూహెచ్​ఓకు అమెరికా నిధులు ఆపేస్తే లాభం చైనాకే'

By

Published : May 21, 2020, 7:57 PM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్​ఓ)కు అమెరికా నిధులు నిలిపివేస్తే.. కరోనా నియంత్రణ చర్యలపై తీవ్ర ప్రభావం పడుతుందని జార్జ్​టౌన్​ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్​ లారెన్స్​ గోస్టిస్ అభిప్రాయపడ్డారు. నిధుల్ని నిలిపివేయడం వల్ల చైనా రాజకీయంగా విజయం సాధించినట్లేనని స్పష్టం చేశారు.

ప్రస్తుత సంక్షోభ సమయంలో అమెరికా డబ్ల్యూహెచ్​ఓను విడిచిపెట్టడం వల్ల ప్రపంచ రాజకీయాల్లో ఆకస్మిక మార్పులు సంభవిస్తాయని లారెన్స్ పేర్కొన్నారు. ఈ చర్య ఎంతమాత్రం క్షమించేది కాదని వ్యాఖ్యానించారు.

"కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. అంతర్జాతీయ స్థాయిలో బాధ్యత వహించడానికి ఇంతకంటే ఉత్తమమైన వేదిక మరొకటి లేదు. ఇప్పుడు ఆ స్థానాన్ని చైనా భర్తీ చేయాలని చూస్తోంది. కానీ చైనాకు ఆ హక్కులేదు. ఎందుకంటే ఆ దేశం ఎప్పుడూ అంతర్జాతీయ పౌరుడిగా ప్రవర్తించలేదు. కానీ అమెరికా అధ్యక్షుడు చైనాకు ఇచ్చిన బహుమతి(నిధుల నిలిపివేత) ఎంతో ప్రమాదకరమైనది. ప్రపంచానికే కాక అమెరికా జాతీయ ప్రయోజనాలకూ అది కీడు కలిగిస్తుంది."

-లారెన్స్ గోస్టిన్, జార్జ్​టౌన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్​

కరోనా వైరస్​ వ్యాపి, కేసుల విషయంలో.. చైనా పారదర్శకత చూపించకపోవడాన్ని గోస్టిన్​ అంగీకరించారు. అయితే అమెరికా సైతం డబ్ల్యూహెచ్​ఓ సూచనలు పాటించడం లేదని ఆరోపించారు.

సంస్థలో తమ సభ్యత్వాన్ని వదులుకునే విషయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకునే అధికారం ట్రంప్​కు లేదని.. ఇందుకు కాంగ్రెస్​ అనుమతి కావాలని తెలిపారు గోస్టిన్​. డబ్ల్యూహెచ్​ఓకు నిధుల ఉపసంహరించే అంశంపై ట్రంప్​న​కు సెనేట్​ మద్దతివ్వకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

చైనా, డబ్ల్యూహెచ్​ఓలపై ట్రంప్ మండిపాటు

కరోనా వ్యాప్తి విషయంలో డబ్ల్యూహెచ్​ఓ, చైనాలపై మొదట్నుంచీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కరోనా వైరస్​ వ్యాపి, కేసులపై కచ్చితమైన సమాచారాన్ని అందిచకుండా.. చైనా అంతర్జాతీయ వైద్య నిబంధనలను ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. చైనా చేతిలో డబ్ల్యూహెచ్ఓ ఓ కీలుబొమ్మలా పనిచేస్తోందంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలోనే తమ దేశం నుంచి డబ్ల్యూహెచ్​ఓకు అందించే నిధులను తాత్కాలికంగా నిలిపివేస్తామని ప్రకటించారు ట్రంప్. చైనా అధీనంలో కాకుండా స్వతంత్రంగా పనిచేస్తున్నామని 30 రోజుల్లోగా డబ్ల్యూహెచ్​ఓ నిరూపించుకోవాలని హెచ్చరించారు.

డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా ఏటా రూ. 3400 కోట్లకుపైగా నిధులను సమకూరుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details