కరోనా వైరస్ తీవ్రత గురించి హెచ్చరించినప్పటికీ చెవికెక్కించుకోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే విమర్శల పాలయ్యారు. తాజాగా న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వేదికగా ఇలాంటి వ్యాఖ్యలతో ఓ బిల్‌బోర్డు దర్శనమిచ్చింది. 'ట్రంప్ డెత్ క్లాక్' పేరుతో న్యూయార్క్‌కు చెందిన సినీనిర్మాత యూజీన్ జారెకి దాన్ని ఏర్పాటు చేశారు. ట్రంప్ తగిన సమయంలో చర్యలు తీసుకొని ఉంటే ఆపగలిగే మరణాల సంఖ్యను దాని మీద ప్రదర్శించారు.
కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు అమెరికాలో 81వేలకు పైగా మరణాలు సంభవించాయి. అయితే ట్రంప్ యంత్రాంగం సరైన సమయంలో స్పందించి ఉంటే 48,000 పైగా మరణాలను అరికట్టగలిగేవాళ్లమని జారెకి విమర్శించారు.
మార్చి 16న కాకుండా మార్చి 9 నుంచే సామాజిక దూరం, పాఠశాలల మూసివేత వంటి కఠిన నిబంధనలు అమలు చేసి ఉంటే ఆ మరణాలు సంభవించేవే కాదని ఆ డెత్ క్లాక్‌లో ఆయన పేర్కొన్నారు. ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ వ్యాఖ్యలను అనుసరించి నిపుణులు వేసిన లెక్కల ఆధారంగా... అరికట్టగల మరణాలు 60 శాతంగా ఉన్నాయన్నారు.