డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయారు. కానీ, ఆయనది ఓటమిని అంగీకరించే స్వభావం కాదు. ఫలితాల సరళిపై ఇప్పటికీ పోరాడుతున్నానని చెబుతున్నారు. అయితే ఏదో ఒక సమయంలో ఆయన మెట్టుదిగాల్సిందే. వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ట్రంప్ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. దేశ ప్రయోజనాల కోసం ఓటమిని అంగీకరించడం. లేదా అంగీకరించకుండా బలవంతంగా పదవీభ్రష్టుడు కావడం.
నాలుగు రోజుల కౌంటింగ్ తర్వాత ఎట్టకేలకు జో బైడెన్ విజేతగా అవతరించారు. కానీ రేసు ఇంకా ముగియలేదని ట్రంప్ చెబుతున్నారు. ఓటింగ్‌లో మోసాలు జరిగాయని నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. న్యాయపోరాటానికి మొగ్గుచూపుతున్నారు.
ఎన్నికల్లో ఓటమిని ట్రంప్ ఎప్పటికీ అంగీకరించరనే ట్రంప్‌కు సన్నిహితంగా ఉండే కొందరు చెబుతున్నారు. తన అధ్యక్ష పదవిని నిర్లక్ష్యంగా పూర్తిచేసి శ్వేతసౌధాన్ని విడిచిపెడతారని అంటున్నారు.
ఓట్ల లెక్కింపులో మోసాలు ఉన్నాయంటూ ట్రంప్ చేస్తున్న ఆరోపణలు, ఇతర ప్రయత్నాలన్నీ ఓటమితో నిరాశ చెందిన తన మద్దతుదారులకు ఉపశమనం కలిగించేందుకేనన్నది విశ్లేషకుల మాట. తాను ఇంకా పోరాడుతూనే ఉన్నానని మద్దతుదారులకు భావన కల్పించేలా చేస్తున్నారని చెబుతున్నారు.
"ఓటమిని అంగీకరించడంపై నాకు అనుమానం ఉంది. ట్రంప్ పోరాడటం వల్ల బైడెన్‌పై వ్యతిరేకత ఉంటుంది. అమెరికాలోని సగం మంది ఓటర్లు బైడెన్ చట్టవిరుద్ధంగా ఎన్నికయ్యారనే భావిస్తారు. ఈ అప్రతిష్ఠ బైడెన్‌పై ఉంటుంది."
-రోజర్ స్టోన్, ట్రంప్ స్నేహితుడు, సలహాదారుడు
కుమారులు అలా.. అల్లుడు ఇలా..
ట్రంప్ ఒకవేళ మీడియా సంస్థను ఏర్పాటు చేసినట్లయితే ఈ ఎన్నికల్లో అవకతవకలపై వివాదాన్ని మరింతగా కొనసాగించే అవకాశం లభిస్తుంది. ఈ రకంగా 2024లోనూ తిరిగి వచ్చేందుకు ఆయనకు ద్వారాలు తెరిచే ఉంటాయి. అప్పటికి ట్రంప్ వయసు ప్రస్తుతం బైడెన్‌తో పోలిస్తే ఒక ఏడాది ఎక్కువగా ఉంటుంది. తన ఇద్దరు కుమారులు డొనాల్డ్ జూనియర్, ఎరిక్ సైతం ట్రంప్‌ను పోరాడుతూనే ఉండాలని కోరుతున్నారు. రిపబ్లికన్లు ఆయనకు అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఇతర సన్నిహితులు, శ్వేతసౌధ అధికారులు మాత్రం ట్రంప్ తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. అధికార బదిలీ సాఫీగా నిర్వహించేందుకు కట్టుబడి ఉండాలని చెబుతున్నారు. అందుకు సహకరిస్తానని కొద్దిరోజుల్లోగా ప్రకటన చేయాలని స్పష్టం చేస్తున్నారు.
ట్రంప్ అల్లుడు, అధ్యక్షుడి సీనియర్ సలహాదారుడైన జేరడ్ కుష్నర్ సైతం ఆయనకు ఇదే విధంగా సలహా ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలను అంగీకరించాలని ట్రంప్‌కు కుష్నర్ చెప్పినట్లు సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ట్రంప్‌కు మద్దతుగా మాట్లాడిన ఫాక్స్ న్యూస్ హోస్ట్ లారా ఇన్గ్రహమ్ సైతం అధ్యక్షుడిని హుందాగా వ్యవహరించాలని కోరారు. తన తర్వాతి కార్యాచరణ దృష్టిలో ఉంచుకొని అధ్యక్ష భవనాన్ని వీడాలని సూచించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేలా వ్యవహరిస్తేనే ట్రంప్ వారసత్వానికి మరింత ప్రాధాన్యం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
న్యాయపోరుకే మొగ్గు
ఈ వారాతంలో దొరికిన ఖాళీ సమయాన్ని ట్రంప్ ఉపయోగించుకొని ఓ నిర్ణయానికి వస్తారని చాలా మంది సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. అయితే మరిన్ని న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికే ప్రణాళికలు రచిస్తారని చెప్తున్నారు. కానీ ఇవన్నీ ఫలితం కోసం కంటే తాను పోరాడుతున్నాననే భావన కల్పించేందుకే ఉపయోగపడతాయని మరికొందరు స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి-బైడెన్ ప్రభుత్వ ఏర్పాటు సాఫీగా సాగేనా?
ఎన్నికల ఫలితాన్ని సవాలు చేసేందుకు ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంటానని ట్రంప్ ఇప్పటికే స్పష్టంగా చెప్పేశారు. శ్వేతసౌధాన్ని డెమొక్రాట్లు దోచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు మండిపడ్డారు. ఇలాంటి ట్రంప్ వైఖరి వల్ల ఎన్నికలకు ముందే దేశంలో విభజన రేఖలు ఏర్పడ్డాయి. ఎన్నికల తర్వాత పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. కొన్ని నగరాల్లో ట్రంప్ మద్దతుదారులు తుపాకులు పట్టుకొని బహిరంగంగా తిరుగుతున్నారు. కౌంటింగ్ జరిగే భవనాల ఎదుట ర్యాలీలు నిర్వహించారు. ఈ పరిస్థితుల మధ్య ట్రంప్ తర్వాత ఏం చేస్తారో అన్న విషయంపై ఆసక్తితో పాటు ఆందోళన నెలకొంది.