అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రోజులు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమొక్రాట్ల అభ్యర్థి బో బైడెన్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. తమదైన రీతిలో ప్రచార కార్యక్రమాలతో పాటు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఇండో-అమెరికన్, ఆఫ్రికన్-అమెరికన్ ఓట్లను ఆకర్షించేందుకు భారత సంతతి మహిళ కమాలా హ్యారిస్‌కు ఉపాధ్యక్ష పదవికి నామినేట్ చేశారు బైడెన్. అయితే ట్రంప్ కూడా ఇండో-అమెరికన్లను ఆకర్షించేందుకు ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీనే రంగంలోకి దించారు. ఎలా అంటారా..?
వీడియోతో చెప్పించారు...!
"ఫోర్ మోర్ ఇయర్స్" పేరిట విడుదలైన 107 సెకన్ల ట్రంప్ ప్రచార వీడియోలో.. మోదీ కనిపించారు. గతేడాది మోదీ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో హ్యూస్టన్‌లోని ఎన్ఆర్జీ స్టేడియంలో 'హౌడీ మోడీ' పేరిట భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ చారిత్రక కార్యక్రమంలో దాదాపు 55 వేల మందికి పైగా ఇండో-అమెరికన్లు హాజరయ్యారు. అయితే ఆ వేదికపై మోదీ-ట్రంప్ చేయి పట్టుకొని తీసుకున్న ఫొటో, ప్రసంగం సన్నివేశాలను తాజాగా తమ వీడియోలో పెట్టింది ట్రంప్ ప్రచార బృందం.
ఆ సభలో ప్రసంగించిన మోదీ.. ట్రంప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదని పేర్కొన్నారు. దాదాపు అన్ని దేశాల చర్చల్లో ఆయన పేరు ప్రస్తావనకు వస్తుందని కితాబిచ్చారు. ఆ బైట్‌ను ప్రచార వీడియోలో పెట్టింది ట్రంప్ బృందం.
ఇండో-అమెరికన్లలో మోదీకి విశేషాదరణ ఉంది. ఆయన చెప్తే ప్రజలు వింటారని ట్రంప్ వర్గానికి నమ్మకం. అంతేకాదు 2015లోనూ మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో, 2017లో సిలికాన్ వ్యాలీలో మోదీ ప్రసగించారు. ఒక్కో కార్యక్రమానికి దాదాపు 20 వేల మందికి పైగా హాజరయ్యారు. అమెరికాలో భారీ ర్యాలీల్లో పాల్గొన్న విదేశీ నేత ప్రధాని మోదీ మాత్రమే. కాబట్టి మోదీ ఇమేజ్ను తన ప్రచారం కోసం వాడుకోవాలని ట్రంప్ వర్గం భావిస్తోంది.