అమెరికా-తాలిబన్ల శాంతి చర్చలకు ట్రంప్ బ్రేక్ అఫ్గానిస్థాన్లో శాశ్వత శాంతి స్థాపన కోసం దౌత్యపరంగా జరుగుతున్న ప్రయత్నాలకు ఒక్కసారిగా అడ్డుకట్ట పడింది. తాలిబన్లు, అఫ్గానిస్థాన్ నాయకులతో నిర్వహించాల్సిన రహస్య శిఖరాగ్ర సమావేశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. గురువారం కాబుల్లో 12 మందిని బలిగొన్న ఉగ్రదాడికి తాలిబన్లు బాధ్యత ప్రకటించుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్.
'తాలిబన్లను నమ్మలేం'
మేరీల్యాండ్ వేదికగా తాలిబన్లతో చర్చలు జరపడానికి ప్రయత్నించానని ట్రంప్ పేర్కొన్నారు. అయితే తాలిబన్లు నిరంతరం, భయంకర హింసను ప్రేరేపిస్తున్నారని, అది వారిని నమ్మదగని భాగస్వాములుగా చేసిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
"తాలిబన్ ప్రధాన నాయకులు, అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు ఆదివారం విడివిడిగా నాతో రహస్యంగా సమావేశం కావాల్సి ఉంది. దురదృష్టవశాత్తు తాలిబన్లు మా గొప్ప సైనికుల్లో ఒకరిని, అలాగే మరో 11 మందిని కాబుల్లో చంపేశారు. వెంటనే నేను సమావేశాన్ని రద్దు చేసుకుని శాంతి చర్చలను విరమించుకున్నాను. లేని పరపతిని, బలాన్ని పెంచుకోవడం కోసం, బేరసారాలు నడపడం కోసం తాలిబన్లు ఎంతో మందిని చంపుతున్నారు. ఇది దిగజారుడుతనం." -డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఇదీ చూడండి: బ్రెగ్జిట్: బోరిస్ ప్రభుత్వం నుంచి కీలక మంత్రి ఔట్