తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా ఎన్నికల ప్రచారం 'చైనా'మయం!

భారత సరిహద్దులోనే కాదు అమెరికాలోనూ ఆ వ్యవహారమే నడుస్తోంది. నేపాల్ రాజకీయాల్లోనే కాక అగ్రరాజ్య ఎన్నికల పోరులోనూ కీలక పాత్ర పోషిస్తోంది. అదే చైనా. బీజింగ్​కు మద్దతిస్తోంది మీరంటే మీరంటూ... డ్రాగన్​ను కట్టడి చేసే సామర్థ్యం మాకే ఉందంటూ డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు.

Trump, Biden try to outdo each other on tough talk on China
అమెరికా ఎన్నికల ప్రచారంలో 'చైనా' దూకుడు!

By

Published : Jul 15, 2020, 3:03 PM IST

జాతి విద్వేషంపై మాటల యుద్ధం ముగిసింది. వలస విధానాలపై అభిప్రాయభేదాలు పక్కకుపోయాయి. ఆర్థిక వ్యవస్థ, గన్ కల్చర్, వాతావరణ మార్పులు వంటి విషయాలన్నీ అమెరికా అధ్యక్ష ప్రచారంలో కాస్త బ్రేక్ తీసుకున్నాయి. ఇప్పుడేం నడుస్తోందంటారా...? అదే చైనా!

ఇదే ప్రధానాంశం

అమెరికా అధ్యక్ష ఎన్నికలు చైనా చుట్టూ తిరుగుతున్నాయి. గత కొద్ది రోజుల్లో అధ్యక్ష అభ్యర్థులకు ఇదే ప్రధానాంశంగా మారింది. డ్రాగన్​ను కట్టడిచేసేది నేనంటే నేనంటూ ట్రంప్- బైడెన్​ మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

ట్రంప్ ప్రచారాస్త్రాలివే

చైనాతో తొలి విడత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని ప్రస్తావించి ట్రంప్​ను కీర్తిస్తున్నారు ప్రచారకర్తలు. వాణిజ్య యుద్ధానికి ముగింపు పలికి స్టాక్​మార్కెట్ల భయాలను తొలగించారని ప్రచారం చేస్తున్నారు. ఒబామా హయాంలో కుదుర్చుకున్న బహుళజాతి ఒప్పందాల ఫలితంగా పశ్చిమ మధ్య రాష్ట్రాల్లోని తయారీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయిన విషయాన్ని బైడెన్​కు ముడిపెడుతున్నారు.

చైనా కమ్యునిస్టు పార్టీ విధానాల నుంచి వచ్చే నష్టాల నుంచి అమెరికాలోని వ్యాపారాలు, ఉద్యోగాలను కాపాడినట్లు ట్రంప్ యంత్రాంగం వైట్​హౌస్ ద్వారా పదేపదే ప్రజలకు తెలియచెబుతోంది. చైనా అధికారులపై ఆంక్షలు సహా ఇందుకు సంబంధించి ఏప్రిల్​ నుంచి తీసుకున్న దాదాపు 24 చర్యల వివరాలను శ్వేతసౌధం విడుదల చేసింది. కొంత మంది రిపబ్లికన్ అధికారులు చైనా విధానాలను విమర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ట్రంప్ యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలతో చైనాపై వ్యతిరేక దృక్పథంతో ఉన్నవారి సంఖ్య పెరుగుతోంది.

మరోవైపు బైడెన్ కుమారుడు హంటర్​కు చైనాతో వాణిజ్య సంబంధాలు ఉన్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు.

బైడెన్​ వ్యూహాలు

చైనాపై కఠినంగా మాట్లాడతారే గానీ కరోనా విషయంలో చైనాను జవాబుదారీగా ఉంచడంలో విఫలమయ్యారంటూ ట్రంప్​ను విమర్శిస్తోంది బైడెన్ ప్రచార బృందం. చైనాతో కేవలం ఒక్క వాణిజ్య ఒప్పందమే చేసుకున్నారని చెబుతోంది. వాణిజ్య చర్చలు జరుగుతున్నప్పుడు దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం కేసులు, మరణాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.

చైనాతో ట్రంప్ 'డీల్'

నవంబర్ ఎన్నికల్లో తనకు ప్రయోజనం కలిగేలా వ్యవసాయ రాష్ట్రాల నుంచి సోయాబీన్, గోధుమను పెద్ద ఎత్తున కొనుగోలు చేయాలని షీ జిన్​పింగ్​ను ట్రంప్ అభ్యర్థించినట్లు మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తన పుస్తకంలో ప్రస్తావించిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు డెమొక్రాట్లు. పశ్చిమ చైనాలో ముస్లింలు, ఇతర మైనారిటీల కోసం నిర్బంధ క్యాంప్​లు నిర్మించడం సరైనదేనంటూ జిన్​పింగ్​తో ట్రంప్ అన్నారని బోల్టన్ తన పుస్తకంలో రాసిన విషయాన్నీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

అంతా బాగుచేస్తాం

మిత్రదేశాలతో సంబంధాలను ట్రంప్ బలహీనపర్చారని బైడెన్ బృందం ప్రచారం చేస్తోంది. చైనా తన ప్రభావాన్ని మరింత పెంచుకునే విధంగా అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలిగారని చెబుతున్నారు. బైడెన్ అధికారంలోకి వస్తే అమెరికా మిత్రదేశాలతో సంబంధాలు పునరుద్ధరిస్తారని, అంతర్జాతీయ సమాజాన్ని కలుపుకొని చైనాకు వ్యతిరేకంగా పోరాడతారని ప్రజల్లో విశ్వాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

వీడియో వార్

ట్రంప్, బైడెన్​ ఎన్నికల ప్రకటనల వీడియోల్లోనూ చైనానే కీలకాంశమైంది. గతంలో చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​తో బైడెన్ ఓ విందుకు హాజరైన దృశ్యాల్ని యాడ్​ల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్తోంది ట్రంప్ బృందం. ఇందుకు కౌంటర్​గా... జిన్​పింగ్​కు ట్రంప్​ ఫ్లోరిడాలోని తన సొంత హోటల్​లో ఆతిథ్యం ఇవ్వడాన్ని గుర్తుచేస్తోంది బైడెన్ బృందం. కరోనా గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, జిన్​పింగ్ వైరస్​ విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నారని గతంలో ట్రంప్ ప్రశంసించడాన్ని పదేపదే ప్రస్తావిస్తోంది.

"ఇది క్లిష్టంగా మారుతోంది. కానీ ఎవరికి ప్రయోజనం కలుగుతుందో తెలియదు. చైనాతో ప్రధానంగా మూడు విషయాల్లో సమస్యలు ఉన్నాయి."

- ఫ్రాంక్ లంట్జ్, రిపబ్లికన్ పార్టీ వ్యవహారాల నిపుణుడు

నవంబర్ ఎన్నికల్లో చైనా సమస్య కేవలం విదేశాంగ విధానానికే పరిమితం కాదని.. మరో రెండు సమస్యలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలుస్తోంది. కరోనా నియత్రణలో చైనా వైఫల్యం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తలకిందులైందని నిపుణులు భావిస్తున్నారు. ఈ విషయాలు ఎన్నికలను నడిపిస్తాయని అంచనా వేస్తున్నారు.

ఓటర్ల మేధోమథనం

చైనాను సమర్థంగా ఎదుర్కొనేది ఎవరనే విషయంపైనా ఓటర్లు మదిలో లెక్కలు వేసుకుంటున్నారు. చైనా వాణిజ్య పద్ధతులు, మేధోహక్కుల చోరీ, మానవహక్కుల ఉల్లంఘన, ప్రపంచదేశాలపై దూకుడైన వైఖరికి దీటుగా జవాబిచ్చే నాయకుడు ఎవరా అని చర్చించుకుంటున్నారు.

"చైనా నాయకులకు ఏ వ్యక్తి లోబడి ఉంటాడని ప్రజలకు అనిపిస్తే ఆ వ్యక్తి ప్రమాదంలో పడినట్లే."

- ఫ్రాంక్ లంట్జ్, రిపబ్లికన్పార్టీ వ్యవహారాల నిపుణుడు

చైనాకు అమెరికన్లూ వ్యతిరేకమే!

అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్యూ రీసర్చ్ సెంటర్​ మార్చిలో ఓ సర్వే​ నిర్వహించింది. చైనా పట్ల అమెరికా ప్రజలు తీవ్ర వ్యతిరేక భావంతో ఉన్నారని ఇందులో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న 66 శాతం మంది చైనా పట్ల ప్రతికూల భావనతోనే ఉన్నామని స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం నిర్వహించిన ఇదే సర్వేలో 48 శాతం మంది మాత్రమే ప్రతికూలంగా స్పందించడం గమనార్హం.

ఎవరు సమర్థులు?

చైనాతో వ్యవహరించడంలో ఏ అభ్యర్థి మెరుగ్గా పనిచేస్తారని జూన్ తొలి వారంలో ఎన్​బీసీ న్యూస్, వాల్​స్ట్రీట్ జర్నల్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో అమెరికన్ ఓటర్లు సమానంగా విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రశ్నకు.. 43 శాతం మంది ట్రంప్ సమర్థులని అభిప్రాయం వ్యక్తం చేశారు.​ మరో 40 శాతం మంది బైడెన్​ వైపు మొగ్గు చూపారు. 5 శాతం మంది ఇద్దరు సమానమే అని తేల్చగా... 10 శాతం మంది మాత్రం ఇద్దరూ అసమర్థులని అభిప్రాయపడ్డారు.

ఇలా చైనా చుట్టూ తిరుగుతున్న అగ్రరాజ్య రాజకీయం... ఎలాంటి మలుపు తిరుగుతుందో నవంబర్​లోనే తేలనుంది.

ABOUT THE AUTHOR

...view details