ట్రంప్-కిమ్ ముచ్చటగా మూడోసారి భేటీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో మూడోసారి భేటీ అయ్యారు. ఉభయ కొరియాల సరిహద్దుల్లోని డీఎంజీ(సైనికరహిత) ప్రాంతానికి వచ్చిన ట్రంప్‌ను కిమ్ జోంగ్ ఉన్ కలిశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు.
ఉత్తరకొరియాలో పర్యటించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా అరుదైన ఘనత సాధించారు ట్రంప్. ఈ దేశంలో అడుగుపెట్టినందుకు గర్వంగా ఉందని కిమ్‌కు ట్రంప్ చెప్పారు.
గతంలో ఇరుదేశాల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకుని, భవిష్యత్తులో కలిసి ముందుకు సాగాలని ట్రంప్ ఆకాంక్షించటం ఆనందంగా ఉందన్నారు కిమ్. ట్వీట్ ద్వారా ట్రంప్ ఆహ్వానం పంపడం ఆశ్చర్యాన్ని కలగజేసిందని తెలిపారు.
సరిహద్దులో కిమ్‌తో రెండు నిమిషాలు మాట్లాడతానన్న ట్రంప్... 50 నిమిషాల పాటు చర్చలు జరిపారు.
ఉభయకొరియా సరిహద్దు ప్రాంత గ్రామం పన్మున్జోమ్లోని 'ఫ్రీడమ్ హౌస్' భవనంలో కిమ్‌తో జరిగిన భేటీలో ట్రంప్‌తో పాటు ఆయన కూతరు ఇవాంకా ట్రంప్, అల్లుడు జేర్డ్ కుశ్నర్ పాల్గొన్నారు.
ఉత్తరకొరియాలో పరిస్థితులు మారాయి
కిమ్‌తో తొలిసారి భేటీ అయినప్పుడు ఉత్తరకొరియాలో ప్రమాదకర పరిస్థితులున్నాయని, ప్రస్తుతం అలా లేదని చెప్పారు ట్రంప్. పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. అణ్వాయుధ కార్యకలపాల కేంద్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. ఉత్తర కొరియాపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలంటే ఇది జరిగితీరాలని స్పష్టం చేశారు. అణు కార్యక్రమాలపై కిమ్‌తో మరోసారి చర్చలు జరుపుతామని చెప్పారు ట్రంప్. కిమ్‌ను అమెరికా రావాలని ఆహ్వానించినట్లు వెల్లడించారు.
అణు కార్యకలపాలపై చర్చించేందుకు చివరిసారి ఫిబ్రవరిలో వియత్నాంలో ట్రంప్-కిమ్ రెండోసారి భేటీ అయ్యారు. ఎలాంటి పురోగతి లేకుండానే చర్చలు ముగిశాయి.
ఇదీ చూడండి: ట్రంప్-కిమ్ సాక్షిగా జవాన్లు, పాత్రికేయుల ఫైట్