విదేశీ విద్యార్థుల విషయంలో తీసుకొచ్చిన నూతన తాత్కాలిక వీసా విధానంపై అమెరికా వ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతున్న వేళ ట్రంప్ సర్కారు వెనకడుగు వేసింది. పూర్తి స్థాయి ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు సిద్ధమైన విద్యాసంస్థల్లో చదువుకునే విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాలంటూ ఈనెల 6న తీసుకొచ్చిన నిబంధన రద్దుకు ట్రంప్ ప్రభుత్వం అంగీకరించింది.ఈ నిర్ణయంతో అమెరికాలో చదువుతున్న భారతీయులు సహా వేలాది మంది విదేశీ విద్యార్థులకు ఊరట లభించింది.
ఈ వీసా విధానాన్ని సవాలు చేస్తూ హార్వర్డ్ విశ్వవిద్యాలయం, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేతృత్వంలో అనేక విద్యా సంస్థలు వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి. ఈ కేసు విచారణలో భాగంగా యధాతథ స్థితికి తిరిగి వచ్చేందుకు ట్రంప్ సర్కారు అంగీకరించిందంటూ బోస్టన్‌లోని ఫెడరల్ జిల్లా కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. ఈ నిర్ణయం దేశమంతా అమల్లోకి వస్తుందని తెలిపారు.