హెచ్1బీ వీసా నిబంధనల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పలు ఆంక్షలను సడలించింది. వీసా నిషేధ ప్రకటనకు ముందు నిర్వర్తించిన ఉద్యోగాల కోసం అమెరికాకు తిరిగి రావాలనుకునే ఉద్యోగులకు ఊరట కల్పించింది. అమెరికా వచ్చేందుకు వీరికి అనుమతిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది.
వీసా హోల్డర్లతో పాటు వారి భాగస్వాములు, పిల్లలు సైతం అమెరికాకు రావొచ్చని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్ అడ్వైజరీ పేర్కొంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం కోసం అత్యవసర సేవలందించే సాంకేతిక నిపుణులు, సీనియర్ మేనేజర్లు, ఇతర హెచ్1బీ వీసాదార్లకు దేశంలోకి ప్రవేశించేందుకూ అనుమతించింది.
కొవిడ్ మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడానికి పనిచేసే పరిశోధకులు, వైద్య సంరక్షణ నిపుణులకు సైతం ఆంక్షలను సడలించింది.